తిరుపతి ఓటమిపై బ్లేమ్ గేమ్! పవన్ ను టార్గెట్ చేసిన సోము టీమ్ 

పాయే. ప‌రువంతా పాయే. ఇచ్చిన బిల్డ‌ప్ అంతా నీరుగారిపాయే. జాతీయ పార్టీ అని ఫోజులు కొట్టారు. మోదీ బొమ్మ చూపిస్తూ చెల‌రేగిపోయారు. జ‌న‌సేన త‌మ‌కే స‌పోర్ట్ అంటూ ఊరేగారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్‌తో ప‌వ‌ర్‌లోకి వ‌స్తామంటూ ఊద‌ర‌గొట్టారు. రిటైర్డ్ ఐఏఎస్‌ను తీసుకొచ్చి కాషాయ జెండా ఎగ‌రేయాల‌ని క‌ల‌లు గ‌న్నారు. ఇంతా చేస్తే.. అంత హంగామా సృష్టిస్తే.. తిరుప‌తితో బీజేపీ ప‌రువు బ‌జారు పాల‌య్యే. కొండంత రాగం తీసిన క‌మ‌ల‌నాథుల‌కు డిపాజిట్లు కూడా రాక‌పాయే. ఏపీలో బీజేపీ బ‌ల‌మెంతో తేలిపాయే. అందుకే ఇప్పుడు అన్నీ మూసుకొని.. మూటాముల్లె స‌ర్దుకొని.. త‌లెక్క‌డ పెట్టుకోవాలో తెలీక‌.. స‌తమ‌త‌మ‌వుతోంది కాషాయం పార్టీ. 

తిరుప‌తి ఘోర ప‌రాభ‌వం నుంచి బీజేపీ ఇప్ప‌ట్లో బ‌య‌ట ప‌డ‌క‌పోవ‌చ్చు. తిరుప‌తి త‌మ‌కు కాస్తోకూస్తో ఉనికి ఉన్న‌ ఆధ్యాత్మిక న‌గ‌రం కావ‌డం.. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డం.. వ‌ల్ల గెలుపు ఈజీ అనుకున్నారు క‌మ‌ల‌నాథులు. కానీ, ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు బీజేపీని బండ‌కేసి కొట్టినంత ప‌ని చేయ‌డంతో ఇప్పుడు వారంతా ల‌బోదిబోమంటున్నారు. 50 వేల ఓట్లు తెచ్చుకోవ‌డ‌మే జాతీయ పార్టీకి అతిక‌ష్ట‌మైంది. ఇదంతా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు సోము వీర్రాజు వైఫ‌ల్య‌మేన‌ని అంటున్నారు. సోము వీర్రాజు మొద‌టి నుంచి వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌నే టాక్ ఉంది. సోముతో పాటు పార్టీ ఇంచార్జ్ సునీల్ ధియోదర్, విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న ఓవరాక్షన్ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందనే చర్చ బీజేపీలో జరుగుతోంది. అధికార పార్టీ  వైఫల్యాలపై మాట్లాడకుండా ఎంతసేపు టీడీపీపై విమర్శలు చేయడమే వీరి పనిగా ఉంది. అదే ఇప్పుడు పార్టీకి మైనస్ గా మారిందని, తిరుప‌తిలో బీజేపీకి డిపాజిట్ కూడా గ‌ల్లంతైంద‌ని అంటున్నారు. 

తిరుపతి  దారుణ ప‌రాభ‌వం చూసి అధిష్టానం వీర్రాజుపై ఓ రేంజ్‌లో సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో తిరుప‌తి ప‌రాభ‌వ బారాన్ని మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌పై తోసేసే ప్ర‌య‌త్నం చేస్తోంది క‌మ‌ల‌ద‌ళం. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో తాము ఓడిపోయామంటూ కొత్త రాగం తీస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక‌లో అలా క‌థ‌నం కూడా ప్ర‌చురిత‌మైంది. పవన్ ను టార్గెట్ చేస్తు సాక్షిలో వచ్చిన  కథనం వెనక సోము వీర్రాజు, సునీల్ దియోదర్, విష్ణువర్ధన్ రెడ్డి పాత్ర ఉందంటున్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్‌గేమ్ అంటూ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.  

"న‌మ్మితే న‌ట్టేట ముంచార‌ట‌. భావి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా ద్రోహం చేశార‌ట‌. చంద్ర‌బాబుతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒప్పందం చేసుకున్నార‌ట‌. బీజేపీకి వెన్నుపోటు పొడిచార‌ట‌. అందుకే, వారం రోజులు ప్ర‌చారం చేస్తాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఒక్క రోజు ప్ర‌చారంతోనే పేక‌ప్ చెప్పాడ‌ట‌. తిరుప‌తిలో జ‌న‌సేన ఓట్లు బీజేపీకి ప‌డ‌లేద‌ట‌." ఇలా అంతా మీరే చేశారంటూ బీజేపీ ప్ర‌చారం చేస్తోంది. తిరుప‌తి ఓట‌మికి జ‌న‌సేన‌, ప‌వ‌న్‌క‌ల్యాణే కార‌ణ‌మంటూ కోడై కూస్తోంది. ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబుపైనా అభాండం మోపుతోంది. అవును, వాళ్లిద్ద‌రూ ఒక‌ట‌య్యారంటూ మైండ్‌గేమ్ మొద‌లుపెట్టారు క‌మ‌ల‌నాథులు. 

తిరుప‌తిలో బీజేపీకి 50వేల వ‌ర‌కూ ఓట్లు వ‌చ్చాయి. అవ‌న్నీ, జ‌న‌సేన ఓట్లేన‌నేది జ‌నాల మాట‌. కానీ, బీజేపీ మాత్రం జ‌న‌సేన ఓట్లు త‌మ‌కు బ‌దిలీ కాలేద‌ని అంటోంది. త‌మ‌కు ప‌డాల్సిన ఓట్లే ప‌డ్డాయి కానీ, జ‌న‌సేన శ్రేణులు త‌మ‌కు అంత‌గా స‌హ‌క‌రించ‌లేద‌ని ఆడిపోసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ దియోధ‌ర్‌ను.. వ‌కీల్‌సాబ్ సినిమా ప్ర‌మోష‌న్‌కు వాడుకున్నారు కానీ, త‌మ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారానికి  మాత్రం వ‌కీల్‌సాబ్ డుమ్మా కొట్టాడంటూ కాక రేపుతున్నారు. వారం రోజుల‌ని మాటిచ్చి.. ఒక్క రోజు మాత్ర‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్ర‌చారం చేయ‌డానికి చంద్ర‌బాబుతో కుదిరిన ఒప్పందమే కార‌ణ‌మంటూ కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేస్తోంది. ఇలా తిరుప‌తి ఓట‌మిని జ‌న‌సేన ఖాతాలో క‌లిపేసేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది క‌మ‌లం పార్టీ.

బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను జ‌నాలు అస‌హ్యించుకుంటున్నారు. అస‌లు, జ‌న‌సేన కార‌ణంగానే తిరుప‌తిలో టీడీపీ రెండో స్థానానికి ప‌రిమిత‌మైంది. జ‌న‌సేనే క‌నుక టీడీపీతో చేతులు క‌లిపి ఉంటే.. తిరుప‌తి ఫ‌లితం మ‌రోలా ఉండేది. ఇటు చంద్ర‌బాబు నాయ‌క‌త్వం, అటు ప‌వ‌న్ ఛ‌రిస్మా క‌లిస్తే.. ప్ర‌భంజ‌న‌మే ఉండేదంటున్నారు. ఏపీలో పూర్తిగా తుడుచి పెట్టుకుపోయే ప‌రిస్థితికి దిగ‌జారి పోయిన బీజేపీ.. ఆ అవ‌మాన‌భారం నుంచి త‌ప్పించుకోడానికి.. జ‌న‌సేన స‌హ‌క‌రించ‌లేద‌ని, చంద్ర‌బాబుతో ఒప్పందం కుదిరింద‌ని.. సొల్లు వాగుడు వాగుతోందని అంటున్నారు. బీజేపీ న‌వ్యాంధ్ర‌కు తీర‌ని అన్యాయం చేసింది. బీజేపీ.. వైసీపీకి లోపాయికారిగా స‌హ‌క‌రిస్తోంది. ఢిల్లీలో ఆ రెండు పార్టీలు చ‌ట్టాప‌ట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. పార్ల‌మెంట్‌లో ప‌ర‌స్ప‌రం మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాయి. ఆ రెండూ.. దొందుదొందేన‌ని ఆంధ్రులంద‌రికీ తెలుసు. అందుకే, ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా.. బీజేపీని దారుణంగా తిర‌ష్క‌రిస్తున్నారు ఓట‌ర్లు. ఆఖ‌రికి.. మంచి ప‌వ‌ర్ ఉన్న ప‌వ‌ర్ స్టార్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. బీజేపీని ఆద‌రించ‌కుండా గ‌ట్టి షాక్ ఇచ్చారు తిరుప‌తి ప్ర‌జ‌లు. 

పార్టీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు అట్ట‌ర్ ఫ్లాప్‌. తిరుప‌తి ఎన్నిక‌ల ఓట‌మితో బీజేపీకి భ‌విష్య‌త్తుపై ఆశ‌లు లేవు. పోయిన ప‌రువు ఎలాగూ తిరిగిరాదు.. ఏపీలో కాషాయం పార్టీకి ఏమాత్రం ఉనికి లేదు. ఉన్న కాస్తంత ఇమేజ్ కూడా ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారంతో మంట‌గ‌లుస్తోంది. క‌మ‌ల‌నాథులు ఇప్ప‌టికైనా ఇలాంటి మైండ్‌గేమ్‌కు పుల్‌స్టాప్ పెడితే ఆ పార్టీకే మంచిది. లేదంటే, ఏపీలో బీజేపీకి మ‌రిన్ని దారుణ ప‌రాభ‌వాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.