గవర్నర్ పై సోమిరెడ్డి ఘాటు విమర్శలు

 

గత ఏడాది కాలంగా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదో ఒక అంశం మీద యుద్ధం జరుగుతూనే ఉంది. కొన్ని విషయాలలో అవి కోర్టులకి కూడా ఎక్కుతున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి గవర్నర్ నరసింహన్ కి పిర్యాదులు చేసుకొంటూనే ఉన్నాయి. గవర్నర్ ఒకసారి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసారు గానీ అవి ఫలించకపోవడంతో ఈ సమస్యలతో, గొడవలతో తనకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

 

అయితే అందుకు ఆయననే పూర్తిగా తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన పెద్దరికాన్ని, మధ్యవర్తిత్వాన్ని మన్నించి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వంతో రాజీకి సిద్దపడినా అది సిద్దపడకపోవడంతో సమస్యలు, గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. కనుక ఆయన కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గొడవలను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం కనుసైగ చేస్తే ఎక్కడలేని చురుకుదనం ప్రదర్శించే గవర్నర్లు, ఇటువంటి సమయంలో కూడా అదేవిధంగా వ్యవహరించిఉన్నా, లేకపోతే తన ప్రయత్నలోపం లేకుండా ఇరు రాష్ట్రాల మధ్య రాజీ ప్రయత్నాలు కొనసాగించినా ఎవరూ ఆయనను తప్పు పట్టేవారు అవకాశం ఉండేది కాదు.

 

కానీ ఇంతకాలంగా ఎన్ని సమస్యలు ఎదరవుతున్నా నోరు విప్పని తెదేపా, రేవంత్ రెడ్డిని తెరాస ప్రభుత్వం ఎసిబి చేత ట్రాప్ చేయించిన తరువాత ఇక మౌనంగా ఉండలేకపోయింది. గవర్నర్ అధీనంలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద సంఘటన జరిగేవరకు ఆయనకు సమాచారం లేకపోవడం, ఆ తరువాత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడటంతో తెదేపా గవర్నర్ నరసింహన్ పై నేరుగా విమర్శలు గుప్పించింది.

 

ఆ పార్టీ యం.యల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ప్రభుత్వం పదేపదే విభజన చట్టంలో అంశాలను అతిక్రమిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు. గత ఏడాది కాలంలో తెలంగాణా ప్రభుత్వానికి కనీసం పదిసార్లు కోర్టులో మొట్టికాయలు పడ్డాయి కానీ గవర్నర్ మాత్రం ఎ విషయంలో కలిగించుకోలేదు. విభజన చట్టంలో సెక్షన్: 8 తో సహా ప్రతీ అంశం గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలడు. కానీ ఆయన ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారో అర్ధం కావడం లేదు. రెండు రాష్ట్రాలను సమాన దృష్టితో చూడవలసిన గవర్నర్ తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చివరికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఆయన మంత్రులు అందరూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల, ఇతర మంత్రుల పట్ల, ప్రజల పట్ల చాలా అవమానకరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం చాలా బాధాకరం. ఈ విషయం గురించి మా ప్రభుత్వంస్వయంగా ఆయనకు పిర్యాదు చేసినా ఆయనలో ఎటువంటి చలనమూ కనబడలేదు,” అని ఘాటుగా విమర్శలు గుప్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu