తెదేపాకి వర్తించింది తెరాస ఎమ్మెల్యేకి వర్తించదా?

 

ఇంతకు ముందు తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఘాటుగా విమర్శించిన లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఈసారి తెరాస ప్రభుత్వంపై తన అస్త్రాలు సంధించారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానం క్రింద పరిశ్రమలకు రెండువారాలలోనే అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తామని, పారిశ్రామికవేత్తలు ఇకపై అధికారుల చుట్తో తిరగనవసరం లేదని, ఎవరికీ దేనికీ లంచాలు చెల్లించవలసిన అవసరం లేదని హామీలు గుప్పిస్తున్నారు. కానీ వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయని జయప్రకాశ్ మాటలు నిరూపిస్తున్నాయి.

 

హైదరాబాద్ లోని ఓ పారిశ్రామికవాడకు నీరు సరఫరా చేసేందుకు ఒక తెరాస ఎమ్మెల్యే రెండుకోట్లు లంచం అడిగారని ఆరోపించారు. ముందు తన ఎమ్మెల్యేలను నియంత్రించకుండా ఎన్ని పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టినా ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే ఆయన ఆ ఎమ్మెల్యే ఎవరో బయటపెట్టలేదు. తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఒక నియమం, తెరాస ఎమ్మెల్యేలకి మరొక నియమంలా ఉందని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu