అలీగఢ్ యూనివర్సిటీ వీసీ విచిత్ర కామెంట్లు

 

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జమీర్ ఉద్దీన్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. క్యాంపస్‌లో వున్న గ్రంథాలయంలోకి డిగ్రీ విద్యార్థినులను అనుమతించడానికి వీసీ నిరాకరించారు. ఎందుకు అనుమతించడం లేదని అడిగితే, అమ్మాయిలను లైబ్రరీలోకి అనుమతిస్తే అబ్బాయిలు నాలుగింతలు ఎగబడతారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు యూనివర్సిటీలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ విషయం కేంద్ర హెచ్‌ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి వెళ్లింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం వీసీని వివరణ కోరింది. ఈ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ వీసీ వ్యాఖ్యలను కూతుళ్లకు జరిగిన అవమానంగా అభివర్ణించారు. ఇదిలా వుంటే, తన మాటలను వక్రీకరించారని వీసీ వివరణ ఇచ్చారు. ఇది లింగ వివక్ష ఎంతమాత్రం కాదు.. లైబ్రరీలో స్థలం సమస్య. ఇప్పటికే లైబ్రరీ నిండిపోతోంది. అబ్బాయిలు కూర్చోవడానికి కూడా స్థలం లేదు అని వీసీ చెప్పుకొచ్చారు. అలీగఢ్ వైస్ ఛాన్స్‌లర్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థునుల పట్ల వీసీ చేసిన వ్యాఖ్యలు భయంకరమైనవని, అవి షాక్‌కు గురిచేస్తున్నాయని మైనార్టీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా అన్నారు. నాగరిక సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు సహించరానివని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. అమ్మాయిలు లైబ్రరీకి వెళ్లే ఏర్పాటు చేయాలని సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ అన్నారు. లింగవివక్ష ఆధారంగా విద్యార్థులపై నిషేధం విధించడం చట్టపరమేనా అని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ లలితా కుమారమంగళం ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu