పెళ్ళి పేరుతో అమ్మాయిల చెవిలో పూలు
posted on Nov 12, 2014 11:37AM

ఓ మోసగాడు పెళ్ళి చేసుకుంటానని 30 మంది అమ్మాయిలను మోసం చేశాడు. మరో 700 అమ్మాయిలను మోసగించే పనిలో వున్నాడు. ఇతగాడి మోసానికి బలైన ఓ యువతి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు ఆ మోసగాడిని మంగళవారం అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పానటి శశికుమార్ (24) బీటెక్ చదువు మధ్యలోనే ఆపేసి బెంగుళూరులో గాలికి తిరుగుతున్నాడు. వివిధ మాట్రిమోనీ వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలు, విడాకులు పొందిన మహిళలను పరిచయం చేసుకుని, తానొక సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌నని, తాను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నానని వారిని మోసం చేయడం ప్రారంభిస్తాడు. కొన్ని నకిలీ ఫొటోలు చూపించి వాళ్ళని నమ్మించి వాళ్ళతో కలసి షికార్లు చేస్తాడు. వాళ్ళ దగ్గరున్న బంగారు నగలు, ల్యాప్‌టాప్, నగదు చాకచక్యంగా తీసుకుంటాడు. తర్వాత పథకంలో భాగంగా వాళ్ళతో గొడవపెట్టుకొని కనిపించకుండాపోతాడు. ఇతగాడు హైదరాబాద్, బెంగుళూర్‌కు చెందిన 30 మందిని ఇలా మోసం చేశాడు. ఓ యువతి చెల్లెలికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షన్నర తీసుకుని మాయమైపోయాడు. ఆమె చేసిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులకు అయ్యగారి అసలు స్వరూపం తెలిసింది. చాకచక్యంగా వలపన్ని శశికుమార్ని పట్టుకున్నారు. శశికుమార్ 30 మందిని అమ్మాయిలను మోసం చేయడమే కాకుండా... మరో 700 మంది అమ్మాయిలను మోసం చేయడానికి ప్లాన్ వేసినట్టు పోలీసులు వెల్లడించారు.