వైసీపీకి బిగ్ షాక్‌.. ఆ కేసులో ఆరుగురి అరెస్ట్‌...

జ‌గ‌న్‌ను చూసుకొని రెచ్చిపోయారు. అభిమానం అరాచ‌కంగా మారింది. త‌మ‌నెవ‌రు అడిగేద‌ని విర్ర‌వీగారు. సోష‌ల్ మీడియాలో నోటికొచ్చిన‌ట్టు వాగారు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు పోస్టులు పెట్టారు. అయితే, టీడీపీని విమ‌ర్శించిన‌ట్టు హైకోర్టు తీర్పుల‌ను త‌ప్పుబ‌డితే న్యాయ‌స్థానం ఊరుకుంటుందా? అదే చేస్తోంది. త‌మ జ‌డ్జిమెంట్‌పై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు పోస్టులు పెట్టిన వారంద‌రి సంగ‌తి తేల్చమంటూ సీబీఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ సోష‌ల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టిన వారంద‌రిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. ఆ కేసులో తాజాగా మ‌రో ఆరుగురిని అరెస్ట్ చేసింది.

న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం, కిషోర్‌ కుమార్‌ దరిస, సుద్దులూరి అజయ్‌ అమృత్‌లను అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. 

హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు.  మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఏపీ సీఐడీ అధికారుల నుంచి వివరాలు సేక‌రించారు. గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వేర్వేరుగా ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ తాజాగా ఆరుగురిని అరెస్టు చేసింది. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉంటూ, వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. టీడీపీని విమ‌ర్శిస్తున్న కొంద‌రు.. అదే రీతిన న్యాయ‌మూర్తులు, న్యాయ‌స్థానాల‌పైనా ఇష్టం వ‌చ్చిన‌ట్టు పోస్టులు పెట్ట‌డంతో.. ఇప్పుడు వారంద‌ని భ‌ర‌తం ప‌ట్టేందుకు సీబీఐ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వ‌డం వైసీపీ శ్రేణుల‌కు షాకింగ్ ప‌రిణామం..అంటున్నారు.