ప్ర‌భాక‌ర్ రావు విచారణలో సిట్ కొత్త టెక్నిక్

బాధితుల ముందు నిందితుడి విచార‌ణ‌ 

ఫోన్ ట్యాపింగ్ విచార‌ణాధికారులైన డీసీపీ విజ‌య్ కుమార్, ఏసీపీ వెంక‌ట‌గిరి  ప్రభాకరరావును విచారించడంలో కొత్త టెక్నిక్ వాడుతున్నారు.  అదేంటంటే ఫోన్ ట్యాపింగ్ బాధితుల ముందు ప్ర‌ధాన నిందితుడు ప్రభాకరరావును విచారించనున్నారు.  

ఇంత‌కీ ప్ర‌భాక‌ర్ రావు అధ్వ‌ర్యంలో ఎంద‌రి ఫోన్లు ట్యాప్ అయ్యాయ‌ని చూస్తే..  బాధితులు చెప్పే లెక్క‌ల్ని బట్టి  4వేల నుంచి ఆరు వేల వ‌ర‌కూ ఉన్నారు. ఆఖ‌రున డీఎస్పీగా యాక్సిల‌రేటెడ్ ప్ర‌మోట్ అయిన ప్ర‌ణీత్ ఫోన్లోనూ ఎంద‌రో రాజ‌కీయ  నాయ‌కుల ఫోన్ రికార్డింగులున్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.

ప్ర‌భాక‌ర్ రావు చెప్ప‌డం వ‌ల్లే తామిలా చేశామ‌ని ప్ర‌ణీత్ త‌దిత‌రులు చెబితే.. నేను మాత్రం నాటి డీజీపీ  మ‌హేంద‌ర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ అనిల్ చెప్పిన‌ట్టు చేశాన‌ని అంటున్నారు ప్ర‌భాక‌ర్ రావు. ప్ర‌ణీత్ ద్వారా కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుల ద్వారా ప్ర‌భాక‌ర్ రావును క్రాస్ క్వ‌శ్చిన్ చేసిన అధికారులు మంగళవారం (జూన్ 17) ఆయనను కొత్త టెక్నిక్ తో  విచారించ‌బోతున్నారు.

ట్యాపింగ్ బాధితుల్లో సుమారు 600 మంది డేటా సేక‌రించి వారంద‌రినీ పిలిపించి విష‌యం చెప్పారు అధికారులు. మీరు ఈ ఇన్వెస్టిగేష‌న్లో కోప‌రేట్ చేయాల‌ని వారిని కోరారు. వారు కూడా స‌రే అన్నారు. 

ఇక బాధితుల ఆవేద‌న బ‌ట్టి చూస్తే..  భార్యాభ‌ర్త‌ల ఫోన్ కాల్స్ సైతం విన‌డం అన్యాయ‌మ‌ని వాపోయారు. అంతే కాదు త‌మ బంధుమిత్రులంద‌రి ఫోన్ కాల్స్ విన్నార‌నీ.. మేము ఎవ‌రికీ చెప్ప‌కుండా దాచుకున్న నెంబ‌ర్ల‌ను కూడా రికార్డింగ్ లో పెట్టార‌నీ. మా ప్ర‌తి క‌ద‌లిక కాపు కాచార‌నీ.. మా ప్ర‌తి కాల్ విన్నార‌న్న‌ది వీరి ఆవేద‌న‌.

అయితే ఒక రిటైర్డ్ ఐజీ అయిన ప్ర‌భాక‌ర్ రావును, ఆనాటి సీఎస్ సోమేశ్ తిరిగి  ఒక ప‌ద‌విలో  కూర్చోబెట్టి ఇంత‌టి ఘ‌న‌కార్యం చేయ‌డం కూడా క‌రెక్టు కాద‌న్న కోణంలో కొంద‌రు మాట్లాడారు. ఇందులో సోమేశ్ ని సైతం శిక్షించాల్సి ఉంద‌ని డిమాండ్ చేసిన వారున్నారు. వ‌చ్చే రోజుల్లో మ‌రే పాల‌కుడూ కూడా ఇలా చేయ‌కుండా నిందితుల‌కు శిక్ష‌లు ప‌డాల‌ని సూచించారు.

ఇదిలా ఉంటే హోం మంత్రిత్వ శాఖ‌కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి.. మావోయిస్టుల మ‌ద్ద‌తు దారుల‌న్న ముద్ర వేసి ప్ర‌స్తుత మంత్రి ,  ఉద్యోగుల ఫోన్ నెంబ‌ర్లు మొత్తం ట్యాప్ చేశారు నాటి ఎస్ఓటీ అధికారులు. 

మ‌రీ ముఖ్యంగా ప్ర‌ణీత్ రావుకు మునుగోడు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు ప్ర‌భాక‌ర్ రావు. న‌ల్గొండ జిల్లాకు తాను ఎస్పీగా ఉండ‌గా బీబీన‌గ‌ర్ లో ఎస్సైగా ప‌ని చేసేవారు ప్ర‌ణీత్.. ఆ స‌మ‌యంలో సామాజిక వ‌ర్గ సంబంధ బాంధ‌వ్యాల‌ను అడ్డు పెట్టుకుని ప్ర‌భాక‌ర్ రావుతో బాగా ద‌గ్గ‌రైన ప్ర‌ణీత్. ఆయ‌న ఇంటెలిజెన్స్ ఎస్ఐబీకి వెళ్ల‌గానే తాను కూడా ఒక ఇన్ స్పెక్ట‌ర్ గా అందులో జాయిన్ అయ్యారు. ఐదేళ్లు తిరిగే స‌రిక‌ల్లా డీఎస్పీగా ప్ర‌మోట‌య్యారాయ‌న‌.  2007 లో ప్ర‌ణీత్ తో పాటు సుమారు 450 మంది ఎస్సైలు డిపార్ట్ మెంట్లో జాయిన్ అయితే.. వారంద‌రిలోకీ ఒక్క ప్ర‌ణీత్ మాత్ర‌మే డీఎస్పీ ర్యాంక్ లో ఉన్నారు. ఇది అసాధార‌ణంగా చెబ‌తారు.  ప్ర‌ణీత్ పొందిన యాక్సిల‌రేటెడ్ ప్ర‌మోష‌న్ అన్న‌ది యాంటీ మావోయిస్టు కార్య‌క‌లాపాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేసే వారికిస్తారు. అలాంటిది అక్ర‌మ ట్యాపింగ్ కి పాల్ప‌డ్డ ఒక అధికారికి ఇవ్వ‌డం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.

2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక‌.. అప్ప‌టి వ‌ర‌కూ తాము సేక‌రించిన ప్రొఫైల్స్ డేటా మొత్తం 1200 పేజీలు. ఈమొత్తాన్ని ధ్వంసం చేశారు ప్ర‌ణీత్ రావు. అంతే కాదు.. హార్డ్ డిస్క్ ల‌ను ముక్క‌లు చేసి వాటిని మూసీలో ప‌డేశారు. వీట‌న్నిటిని బ‌ట్టి చూస్తే వీరెంత‌టి చేయ‌రాని ప‌ని చేశారో అర్ధం చేసుకోవ‌చ్చంటారు నిపుణులు.

ప్ర‌ణీత్- ప్ర‌భాక‌ర్ ని కూడా ఎదురెదురుగా పెట్టి.. విచారించ‌నున్నారు అధికారులు. ఆపై బాధితుల ఎదుట  కూడా ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్ రావును విచారించ‌నున్నారు. ఆయ‌న‌కు ఈ కేసు తీవ్ర‌త  ఎంతటిదో అర్ధ‌మ‌య్యేలా చేయ‌నున్న‌ట్టు ఈ ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు చెబుతున్నారు. 

బాధితుల్లో కొంద‌రు ఇప్ప‌టికే మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ పై వాళ్లు చెప్పినా.. వీరికంటూ ఒక విచ‌క్ష‌ణ ఉండాలి  క‌దా?  మేము వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుకున్న ప్ర‌తి మాట విన‌డ‌మేంటి? ఇది  ముమ్మాటికీ త‌ప్పు. రాజ్యాంగం  క‌ల్పించిన గోప్య‌తా హ‌క్కును హ‌రించే అధికారం వీరికి ఎవ‌రిచ్చారంటూ తీవ్ర స్తాయిలో విరుచుకుపడుతున్నారు వీరు.. మ‌రి చూడాలి ఈ విచార‌ణ ద్వారా ప్ర‌భాక‌ర్ రావు నుంచి మ‌రెన్ని నిజాలు రాబ‌డుతారో అధికారులు.