హిమాచల్ రేసులో ఆరుగురు కౌన్ బనేగా సీఎం?

సుదీర్ఘ ఎదురు  చూపుల తర్వాత, హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే  అసలు కథ ఇప్పుడే మొదలైంది. అదేదో ఇంగ్లీష్ సామెతలో చెప్పినట్టు విజయానికి అందరూ చుట్టాలే, ఓటమి మాత్రం అనాథ (విక్టరీ హజ్ మెనీ ఫాదర్స్, బట్ ఫెయిల్యూర్ ఈజ్ యాన్ ఆర్ఫన్) అన్నట్లుగా  ఈ అనూహ్య విజయానికి నేనంటే నేను కారణమని  కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు.  ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీపడుతున్నారు. 

దీంతో ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ పెద్దలకు పెద్ద సవాలుగా మారింది.  దివంగత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి, హిమాచల్ ప్రదేశ్ పీసీసీ  అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ సుఖీందర్ సింగ్ సుంఖు, ప్రతిక్ష  మాజీ నేత ముఖేష్ అగ్ని హోత్రీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు కులదీప్ సింగ్ రాథోడ్, ఠాగూర్ కౌల్ సింగ్ ఆశాకుమారి, హర్షవర్ధన్ చౌహాన్.. ఇలా ఓ అరడజను మందికి పైగా, రేసులో నిలిచారు. ఎవరికి వారు  ముఖ్యమంత్రి పదివికి తామే అర్హులమని చెప్పు కుంటున్నారు.  
అయితే హిమాచల్‌ ముఖ్యమంత్రి రేసులో, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌,  మండీ ఎంపీ, ప్రతిభా సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ, తనకు పీసీసీ బాధ్యతలు అప్పగించారని  సోమియా  పార్టీ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశానని ఆమె చెప్పుకుంటున్నారు.

అలాగే  తాను ముఖ్యమంత్రి బాధ్యతలను కుడా సమర్ధవంతంగా నిర్వహించగలనని  అంతే కాకుండా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని ఆమె చెప్పు కొస్తున్నారు. అలాగే పీసీసీ మాజీ అధ్యక్షుడు కులదీప్ సింగ్  కూడా పార్టీ ఏకం చేసి ముందుకు నడిపించిన తనకు ముఖ్యమంత్రి పదవికి అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయని అంటున్నారు. అలాగే, రేసులో ఉన్న ఇతర నాయకులు ఎవరికి వారు, తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

అదలా ఉంటే, శుక్రవారం శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం సిమ్లాలో జరిగింది. అయితే  శాసనసభాపక్ష సమావేశంలో పరిశీలకులుగా వచ్చిన  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు  రాజీవ్‌ శుక్లా, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భాఘేల్‌, హర్యానా మాజీ సీఎం భూపిందర్‌ హుడాకు ఆదిలోనే అపశృతి ఎదురైంది. ప్రతిభా సింగ్ మద్దతుదారులు రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్‌ నేతల వాహనాలను అడ్డుకున్నారు. ఆమెకు మద్దతుగా  నినాదాలు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ పరిశీలకులు పలువురు నేతలు, ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సీఎం ఎంపికపై వారి అభిప్రాయాలను సేకరించారు. సీఎం ఎంపికపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని ముగ్గురు నేతలు స్పష్టం చేశారు. కాగా ప్రతిభా సింగ్ తన భర్త దివంగత మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ పేరు, ఆయన పనితీరు వల్లనే కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని విస్మరించలేరని, ముఖ్యమంత్రి పదవి మరొకరికి ఇవ్వడం సరికాదని అన్నారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ విస్మరించబోదన్న విశ్వాసం వ్యక్త పరిచారు.   శనివారం (డిసెంబర్ 10) సాయత్రం జరిగే శాసనసభా పక్ష సమావేశంలో అదిష్టానం ‘ఎంపిక’ చేసిన నేతను  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకాగ్రీవంగా, ‘ఎన్ను’కుంటారని,  పార్టీలో ఎల్లాంటి విబేధాలు లేవని, ప్రతిభా సింగ్ తెలిపారు.  

అయితే  కాంగ్రెస్ పార్టీలో  గతంలోలాగా అధిష్టానం చెప్పిందే వేదం అన్నట్లుగా  అధిష్టానం ఆదేశాలను తూచా తప్పక పాటించే పరిస్థితులు ఇప్పడు లేవు. మరో వంక బీజేపీ కూడా వెనకటి బీజేపీ కాదు. ఏ చిన్న సందు దొరికినా  దూరిపోవాడానికి బీజేపీ నాయకత్వం సిద్దంగా ఉంది. అందునా, హిమాచల్  బీజేపీ జాతీయ అధ్యక్షడు జీపీ నడ్డా స్వరాష్ట్రం  సో .. కాంగ్రెస్ పార్టీని చీల్చే అవకాశం వస్తే వదులుకోదు. అందుకే కాంగ్రెస్ నాయకత్వం కూడా వేగంగా పావులు కదుపుతోంది. అయితే చివరకు ఏమవుతుంది? ఎవరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది.. ప్రస్తుతానికి సస్పెన్స్.. అందుకే కౌన్ బనేగా సీఎం అనేది ఆసక్తి కరంగా మారిందని అంటున్నారు.