తెలంగాణ రాజకీయ ముఖ్యచిత్రం మారి పోయింది !

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒకసారిగా మారిపోయింది. ఇంతవరకు, ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) భారత రాష్ట్ర సమితి (భారాస)గాపేరు మార్చుకుని  జాతీయ పార్టీగా అవతరించింది.  ఈనేపధ్యంలో  ఇప్పడు రాష్ట్ర రాజకీయ ముఖ్య చిత్రం పై ప్రధానంగా, జాతీయ పార్టీలే కనిపిస్తున్నాయి.  భారాస, బీజేపీ, కాంగ్రెస్ మూడూ  జాతీయ పార్టీలు కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి తెలంగాణ తొలిగి పోయింది. తెలంగాణ అస్తిత్వ వాదం ప్రధాన లక్ష్యంగా, జై తెలంగాణ నినాదంగా  పన్నెండువందల మంది ఆత్మబలిదానంతో అవతరించిన తెలంగాణ రాష్రంలో  ఈ రోజు తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నార్ధకంగా మారింది. 

నిజమే  జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం తెరాస, భారాసగా పేరు మార్చుకున్నా, జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు అయితే రాలేదు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఇల్లు అలకగానే పండగ రాదు, పేరు మార్చుకున్నంత మాత్రాన, జాతీయ పార్టీ గుర్తింపు రాదు. ఎప్పుడో 2012లో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ, (ఆప్)  అప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నా, నిన్న మొన్న గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు, ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న తర్వాత గానీ, జాతీయ పార్టీగా గుర్తింపు రాలేదు. నిజానికి, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి  పుట్టిన ఆప్  కు స్వభావ రీత్యా, సిద్ధాంత పరంగా ఎలా చూసినా మొదటి నుంచి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. అయినా జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన నిబంధనలను దాటుకుని వచ్చేందుకు దాదాపు పుష్కర కాలం పట్టింది. 
నిజానికి  భారాసతో పోలిస్తే  ‘ఆప్’ కు జాతీయ స్థాయి గుర్తింపు ఎక్కువ  అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కు ఢిల్లీ లిక్కర్ స్కాం తెరమీదకు వచ్చే వరకూ మధ్యతరగతి, మేథావి వర్గాల్లో మంచి పేరుంది. ఢిల్లీలో ఆప్  ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలతో పేద ప్రజల్లోనూ మంచి గుర్తింపే సంపాదించుకున్నారు. అలాగే, 2014,అంతకు ముందు నించి కూడా కేజ్రీవాల్ పార్టీ విస్తరణపై దృష్టిని కేంద్రీకరించారు. 2014 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ పై కేజ్రీవాల్ పోటీ చేశారు. ఓడి పోయారు. అయినా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే,ఆప్ 2017, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి  2022 లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయినా, జాతీయ పార్టీగా గుర్తింపు రావడానికి ఇంత కాలం  నేపధ్యంలో ఇప్పుడే పేరు మార్పుతో తొలి అడుగు వేస్తున్న భారాస కు జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చేందుకు అదనంగా ఇంకో పుష్కర కాలం పట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు.

అదొకటి అలా ఉంటే తెరాస ప్రధానంగా ప్రాంతీయ వాదం పునాదులపై ఏర్పడిన పార్టీ  ఇప్పటికీ ప్రాంతీయ వాదాన్నే నమ్ముకుంటున్న పార్టీ  ఇంతవరకు తెలంగాణ అవతల ఏ రాష్ట్రంలోనూ పోటీ చేసింది లేదు. జాతీయ స్థాయిలో అనేక రాజకీయ నాయకులకు తెరాస, కేసీఆర్ తో  పరిచయం ఉన్నా, ఏపీ మినహా మిగిలిన ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలలో, ఈశాన్య భారతంలో సామాన్య ప్రజలకు  పెద్దగా తెరాస తెలియదు. కేసీఆర్ ఎవరో తెలియదు. అలాగే, ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా తెరాస/ భారాసతో చేతులు కలిపేందుకు సిద్దంగా లేవు.  ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి ఏర్పాటుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఏవీ  ఫలించలేదు. 

నిజానికి  ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించినప్పుడు జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు వారికి వచ్చిన  గౌరవం గుర్తింపు  పుష్కరకాలం పైగా ఉద్యమం జరిగినా  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తెలంగాణకు జాతీయ స్థాయిలో రావలసిన గుర్తింపు రాలేదు. తెరాస పేరు మార్పును ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖలో తెరాస కార్యాలయం, చిరునామాలో హైదరాబాద్ నగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. అంటే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ళ తర్వాత కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తించలేక పోయారు. అది సాంకేతిక తప్పిదమే కావచ్చును కానీ, ఒక విధంగా అది తెలంగాణ నాయకత్వం తప్పిదం కూడా అవుతుంది. 

అదొకటి అలా ఉంటే  భారాస  జాతీయ పార్టీగా గుర్తింపు పొందే విషయాన్ని పక్కన పెడితే  తెలంగాణలో భారాస పరిస్థితి ఏమిటి? అనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ లేనిదే తెరాస లేదు. తెరాస లేనిదే తెలంగాణ లేదు. నిన్నమొన్నటి వరకు తెరాస నాయకులు, తెరాస తెలంగాణ ఇంటి పార్టీగా ప్రచారం చేసుకున్నారు.అయితే ఇప్పడు తెలంగాణ పదాన్ని తీసేసి బిఆర్ఎస్ గా   పేరు మార్చుకున్నారు. మరోవంక భారాస ఏర్పాటుతో కెసిఆర్ కి తెలంగాణా కు ఉన్న పేగు బంధం తెగిపోయిందనే విమర్శలొస్తున్నాయి. చివరకు ఏమవుతుంది ? భారాస భవిష్యత్ ఎలాఉంటుంది? అది కాలమే, నిర్ణయిస్తుంది.