పేరు మారితే జాతీయ పార్టీ అవుతుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తహతహలాడిపోతున్నారు. ఇంచుమించుగా నాలుగేళ్ళకు పైగా, జాతీయ రాజకీయాలలో ఎంట్రీ కోసం, చేయని ప్రయత్నం అంటూ లేకుండా చాలా ప్రయత్నాలు చేశారు.సఫలం కాలేదు. చివరకు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ఎంగేజ్  చేసుకున్నారు. అయినా లాభం లేక పోయింది. ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి అంటూ దేశం పట్టుకు తిరిగారు. శరద్ పవార్ మొదలు అరవింద్ కేజ్రీవాల్ వరకు, నితీష్ కుమార్ మొదలు అఖిలేష్ వరకు, మమత మొదలు స్టాలిన్ వరకు తొక్కని  గడప లేకుండా బీజేపీ వ్యతిరేక నేతలందరినీ కలిశారు. అయినా జేడీయు నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మినహా మరెవ్వరు, కేసీఆర్ తో చేయి కలపలేదు. ఇక చివరకు చేసేది లేక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)  పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస)గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి దూకేశారు.

అయితే, భారాస జాతీయ పార్టీ అని  కేసీఆర్ ఆయన పరివారం ప్ర్రచారం చేసుకున్నా, భారాస జాతీయ పార్టీ కాదు. కేంద్ర ఎన్నికల సంఘం, తెరాస పేరు మార్పును ఓకే చేసిందే కానీ  జాతీయ పార్టీగా గుర్తించలేదు. నిజానికి అది కేంద్ర ఎన్నికల్ సంఘం చేతిలో పని కూడా కాదు. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే, అందుకు చాలా తతంగమే ఉంటుంది. 
దేశంలో తెరాస/ భారాస వంటి ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. అలాగే, రిజిస్టర్ అయిన పార్టీలు.. కాని పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలు మాత్రం, ఇంకా రెండకెల సంఖ్యను కూడా తాకలేదు.

గుజరాత్, అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం వరకు ఓట్లు సాధించి,  ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆమ్  ఆద్మీ పార్టీ (ఆప్)తో కలిపి, మొత్తం తొమ్మిది పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. గతంలో కాంగ్రెస్‌, భాజపా, సీపీఐ, సీపీఎం, బీఎస్సీ, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి అవసరమైన ఓట్లు, సీట్లు సాధించడం ద్వారా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) జాతీయ పార్టీ హోదాను పొందింది. ఈ పార్టీకి అంతకముందు మణిపూర్‌, మేఘాలయా, నాగాలాండ్‌లలో గుర్తింపు ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించడం ద్వారా 2019 జూన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్‌పీపీకి జాతీయ హోదాను కల్పించింది. దీంతో దేశంలో   జాతీయ పార్టీల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక తాజగా ఈ జాబితాలో తొమ్మిదో పార్టీగా ఆప్‌ అర్హత సాధించింది.

ఆప్  పదేళ్ల క్రితం దేశ రాజధాని నగరం కేంద్రంగా ఆవిర్భవించిన ఆ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ దిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే కాకుండా తాజాగా జరిగిన గుజరాత్‌ ఎన్నికల్లో దాదాపు 13శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అసలు జాతీయ పార్టీ గుర్తింపు ఎలా లభిస్తుంది? జాతీయ పార్టీ హోదా సాధించాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? అనేది ఒకసారి పరిశీలిస్తే.. అందుకు స్పష్టమైన నిబంధనలను ఎన్నికల సంఘం నిర్దేశించింది. 

ఏదైనా పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం నాలుగు  రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం  చొప్పున ఓట్లు పొందాలి. లేదా.. ఏవైనా మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు గెలుచుకోవాలి..లేదంటే నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు అయినా పొంది ఉండాలి. ప్రస్తుతం ఆప్‌.. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు, ఆరు శాతం ఓట్లు దక్కించుకుంది. తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకొని దాదాపు 13 శాతం వరకు ఓట్లు సాధించడం ద్వారా ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ లెక్కన  పేరు మార్చితేనో..  జెండా మార్చితేనో.. పార్టీకి జాతీయ పార్టీ హోదా రాదు. అలా వస్తుందని ఎవరైనా అనుకుంటే అనుకుంటే  అది అయితే ఆత్మవంచన అవుతుంది ..కాదంటే..అజ్ఞాంతో కూడిన అమాయకత్వం అనిపించుకుంటుంది.