సిద్దరామయ్య..సీన్ రివర్స్ అయిందా..!
posted on May 24, 2017 4:07PM

మంచి పని చేసినా.. చెడు పని చేసినా.. ఏం చేసినా ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది. అయితే అప్పుడప్పుడు అలాంటి పోస్టులు పెట్టి విమర్సలపాలవుతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై.. తాజాగా ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ బెడిసికొట్టి.. ప్రశంసలు అందుకోవాల్సింది బదులు కామెంట్లు అందుకోవాల్సి వచ్చింది. అసలు సంగతేంటంటే... ఓ అంబులెన్సుకు దారిచ్చానన్నట్టు ఆయన గొప్పలు చెపుతూ ట్వీట్ చేశారు. ‘‘వీఐపీ కాన్వాయ్‌ల వైపు అంబులెన్సులు వస్తే వాటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు చెప్పాను. బీటీపీ సిబ్బంది నా ఆదేశాలతోనే ఇవాళ ఓ అంబులెన్సును నా కాన్వాయ్ దాటేలా అనుమతించారు’’ అని పోస్టు చేశారు. అంతే ఇంకేముంది ఇక ట్విట్టర్లో సిద్ద రామయ్యపై ఒకటే తిట్ల వర్షం మొదలైంది. ‘‘ఇదో పెద్ద ఘనకార్యమా? ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అంబులెన్సుకు దారివ్వాలన్న సంగతి తెలుసు’’ అని ఓ నెటిజన్ ఘాటుగా విమర్శించగా... ఇంకో నెటిజన్ మరో అడుగు ముందుకేసి... ‘‘వావ్... గొప్ప పని చేశారు... ఇందుకు మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే...’’ అని వ్యంగ్యాస్త్రం విసిరాడు. మరి ఈ తిట్ల వర్షం ఎప్పుడు ఆగుతుందో చూద్దాం..