శ్రుతిహాసన్ మీద కేసు

 

ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ మీద ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ కోర్టులో ఫిర్యాదు చేసింది. శ్రుతిహాసన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సినిమా చిత్రీకరణకు హాజరు కావడం లేదని, దాంతో తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ఆ సంస్థ హైదరాబాద్ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ హీరోలుగా, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఈ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి ఒప్పుకున్న శ్రుతిహాసన్ ఆ తర్వాత మరో సంస్థతో ఉన్న ఒప్పందం కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ఈ మెయిల్ ద్వారా సంస్థకు తెలియజేసింది. అయితే అప్పటికే ఒక షెడ్యూలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శ్రుతిహాసన్ నిర్ణయం కారణంగా ఆగిపోయింది. శ్రుతిహాసన్ తన వృత్తి ధర్మాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారని, దాంతో తమ సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లిందని, ఆమె మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కోర్టును అభ్యర్థించింది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు శ్రుతిహాసన్ కొత్త సినిమాల ఒప్పందాలను కుదుర్చుకోరాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును విచారించి క్రిమినల్ చర్యలు చేపట్టాని పోలీసులను కోర్టు ఆదేశించింది.