జీహెచ్‌ఎంసీ కమీషనర్ కి హైకోర్టు చివాట్లు

 

‘సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తుచేస్తామంటూ’ మునిసిపాలిటీ వాళ్ళు వేయించే చాటింపుని ప్రజలు ఎప్పుడో అప్పుడు వింటూనే ఉంటారు. అది వినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ ఎవరికీ ప్రశ్నించే ఆసక్తి, ఓపిక, తీరిక ఉండదు కనుక పట్టించుకోవడం మానేస్తారు. కానీ హైకోర్టు మాత్రం దానిని చాలా సీరియస్ గానే తీసుకొంది.

 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఆస్తిపన్ను చెల్లించని వారి ఇళ్ళకి, షాపులకి నీళ్ళు, విద్యుత్ కనెక్షన్లు తొలగించమని జీహెచ్‌ఎంసీ కమీషనర్ సోమేష్ కుమార్‌ ఆదేశించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. “ఆయన తనను తాను నిజాం ఆఫ్ హైదరాబాద్‌లా భావిస్తున్నట్లుందని, అసలు జీహెచ్‌ఎంసీ చట్టం గురించి తెలుసా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ పని కేవలం ఇళ్ల నుంచి చెత్త సేకరించడమే. ఇళ్ళకి విద్యుత్, నీళ్ళ కనెక్షన్లు ఇచ్చేందుకు వేరే వ్యవస్థలున్నాయి. అటువంటప్పుడు ఆ సౌకర్యాలు తొలగించే హక్కు జీహెచ్‌ఎంసీకి ఏవిధంగా ఉంటుందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆస్తి పన్ను చెల్లించని వారి ఇళ్ళకు నీళ్ళు, విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమీషనర్ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu