సింహాద్రి అప్పన్న ఆలయంలో కూలిన షెడ్డు
posted on Jul 5, 2025 5:33PM

సింహాచలం అప్పన్న ఆలయంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు కుప్పకూలింది. ఈ షెడ్డను ఈ నెల తొమ్మిదో తేదీన గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ఏర్పాటుచేశారు. అదృష్టవశాత్తు షెడ్డు కూలిన సమయంలో భక్తులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై భారీ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో షెడ్డు క్రింద ఎవరూ లేకపోవడంతో సరిపోయింది.
ఈ ఏడాది ఏప్రిల్ 30న సింహాద్రి అప్పన్న చందన యాత్ర సందర్భంగా మెట్ల మార్గంలో క్యూ లైన్ గోడ కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా గిరిప్రదర్శన సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డు కూలిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇదే సంఘటన 9వ తేదీన జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని అంటున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకపోయినప్పటికీ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టే సమయంలో నిర్లక్ష్యం, అశ్రద్ధను ఇప్పటికైనా వీడాలని భక్తులు కోరుతున్నారు.