బిజెపి గుప్పిట్లో జగనన్న: షర్మిల
posted on Feb 10, 2024 4:24PM
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత తన అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దూకుడు పెంచారు ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గత ఎన్నికలలో తన పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపుకు దోహదపడ్డ షర్మిల ఈ ఎన్నికల ప్రచారంలో జగన్ ఓటమి కోసం దూసుకుకెళుతున్నారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ సాయంత్రం అల్లూరి జిల్లా చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆమె ప్రసంగిస్తూ, సీఎం జగన్ పై ధ్వజమెత్తారు.
నాడు జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని, మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్నారని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పుడు మద్యపాన నిషేధం జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని ఎత్తిపొడిచారు.
జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు... మరి జగనన్న ప్రత్యేక హోదాపై పోరాటం చేశారా? అని షర్మిల ప్రశ్నించారు. పులి, సింహం అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లిలా మారారని ధ్వజమెత్తారు.
నాడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలను ఎలా తరిమికొట్టారో, రాష్ట్రంలో నియంత పాలకులను కూడా అలాగే తరిమికొట్టాలని అన్నారు. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం, ప్రజలకు మద్దతుగా నిలవని ప్రతిపక్షం మనకు వద్దు అని పిలుపునిచ్చారు.