జగన్ గెలుపుపై కేసీఆర్ కూ నమ్మకం లేదా?

ఏపీ సీఎం జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం అందరిలోనూ కనుమరుగౌతోంది. ప్రజలు, ప్రతిపక్షాలు, ఆఖరికి సొంత పార్టీ క్యాడర్ కూడా జగన్ ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. చివరాఖరికి జగన్ కు అత్యంత విశ్వసనీయ రాజకీయ మిత్రుడిగా గుర్తింపు పొందిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ లో నమ్మకం కోల్పోయారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ విజయానికి దోహదపడేందుకు సాగర్ జలాల వివాదాన్ని అసందర్భంగా తెరమీదకు తీసుకువచ్చి నవ్వుల పాలయ్యారన్న కనీస అభిమానం కూడా కేఃసీఆర్ కు ఇప్పుడు జగన్ మీద లేకుండా పోయింది. 2019 ఎన్నికలలో జగన్ పార్టీకి విజయం దక్కడం కోసం కేసీఆర్ చేసిన సహాయానికి కృతజ్ణతగా కేసీఆర్ మడిచి మూలన పడేసిన తెలంగాణ సెంటిమెంటును బయటకు తీసి రగిల్చేందుకు ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ తనకు చేతనైనంత చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. 

ఆ తరువాత కూడా జగన్ కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని ఇసుమంతైనా దాచుకోలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడి యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న సమయంలో హైదరాబాద్ వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చారు జగన్. కేసీఆర్ ను పరామర్శించేందుకు సమయం చిక్కిన జగన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి అభినందనలు తెలియజేయడానికి కానీ, కనీసం సామాజిక మాధ్యమం ద్వారానైనా విషెస్ చెప్పడానికి కానీ సమయం చిక్కలేదు. మనసు రాలేదు. జగన్, కేసీఆర్ మధ్య రాజకీయ స్నేహం అంత చిక్కటిది మరి. అయితే ఇప్పుడు కేసీఆర్ కు ఏపీలో జగన్ పార్టీ విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న నమ్మకం పూర్తిగా పోయినట్లైంది. 

అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలలో జగన్ ను విశ్వాసం లోకి తీసుకోలేదు. రేవంత్ ను ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ ప్రయత్నాలకూ జగన్ ను విశ్వాసంలోకి తీసుకోకపోవడానికీ సంబంధం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. రేవంత్ పై ఉన్న ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఈ కేసు దర్యాప్తును తెలంగాణ నుంచి బదిలీ చేయాలంటూ కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడైన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన కేసును సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీకి కానీ, పొరుగున ఉన్నకర్నాటకకు కానీ బదిలీ చేయాలని కోరలేదు. ఎందుకంటే కర్నాటకలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఇక ఏపీలో వచ్చే ఎన్నికలలో జగన్ మరో సారి అధికారంలోకి వస్తారన్న నమ్మకం కేసీఆర్ లో లేదు.

అందుకే ఈ కేసును కాంగ్రెస్సేతర సర్కార్ కొలువుదీరి ఉన్న మహారాష్ట్ర కు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ వేశారు. వాస్తవానికి ఏపీలో మరోసారి జగన్ సర్కారే అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏ మూలనైనా కేసీఆర్ లో ఉండి ఉంటే.. రేవంత్ ను ఇరుకున పెట్టడానికి కేసును ఏపీకి బదిలీ చేయాలనే జగదీశ్ రెడ్డి సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ లో కోరి ఉండేవారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఉండటం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆయన ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయంటూ జగదీశ్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.  మామూలుగా ఏపీలో జగన్ కు విజయావకాశాలు లేశమాత్రమైనా ఉండి ఉంటే రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసును ఏపీకి బదిలీ చేయమనే జగదీశ్ రెడ్డి కోరి ఉండేవారనీ, ఆ నమ్మకం లేకపోవడం వల్లే కేసు దర్యాప్తును మహారాష్ట్రకు మార్చాలని కోరారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జగదీశ్ రెడ్డి పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.