నిస్సహాయులకు చెయ్యిద్దామా?

నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత.


ఎందుకీ నిస్సహాయత??


ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు. 


ఎక్కడెక్కడ??


నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు.


చేయూత!!


నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది.


ఒక్క తలుపు తెరవండి!!


ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా. 


ప్రపంచం పెద్దది!!

మనుషులే చిన్నతనంతో ఉన్నారు!!


ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది.


అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!!

◆వెంకటేష్ పువ్వాడ.