మన ఉగాది!!



నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి?? 


ఉగాది వెనుక కథ!!

సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. 

అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది.

శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక. 

ఆశను మొలిపించే తరుణం!!

మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ.

షడ్రుచులు-జీవితసారం!!

ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది.

సంప్రదాయపు గీతిక!!

ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు.

ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.

                                   ◆ వెంకటేష్ పువ్వాడ.