ఏ క్షణంలోనైనా కీలక ప్రకటన
posted on Apr 24, 2011 9:09AM
పుట్టపర్తి: భగవాన్
సత్యసాయి బాబా చికిత్స పొందుతున్న పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. వీఐపీలు పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో భద్రత పెంచినట్టు పోలీసులు చెబుతున్నారు. పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నేడు పుట్టపర్తికి రానున్నారు. దుకాణాలను మూసివేయించారు. రహదారులను దిగ్బంధించారు. అధిక సంఖ్యలో పోలీసులను మొహరించడంపై భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోకి బాబా బంధువులు కంటతడి పెట్టుకుంటూ వెళ్లారు. సత్యసాయి ట్రస్టు సభ్యులు కూడా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఏ సమయంలోనినా బాబా ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఈ ఉదయం 9.30 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. 11 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బాబా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు తెలిపారు.