అమ్మ పార్టీలో  మరో చీలిక తప్పదా? చరిత్ర పునరావృతం అవుతుందా? 

అన్నాడీఎంకే అమ్మను కోల్పోయింది. అధికారం కోల్పోయింది .. మరో వంక అదే సమయంలో స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది ... ఒక విధంగా చూస్తే పార్టీ పరిస్థితే అంతా అగమ్యగోచరంగా ఉంది.ఇలాంటి సమయంలో, ఒకప్పుడు అమ్మ జయలలిత సన్నిహితురాలిగా మేలిగిన్ చిన్నమ్మ శశికళ మరో చిక్కు తెచ్చి పెట్టారు. చిక్కు తెచ్చి పెట్టడం కాదు, ఏకంగా పార్టీకే ఎసరు పెట్టారు. 

కాంగ్రెస్ పార్టీకి, నేనే ప్రెసిడెంట్’ అని సోనియా గాంధీ ప్రకటించుకున్న విధంగా నేనే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిని అంటూ ఏకంగా శిలాఫలకమే చెక్కించుకున్నారు. సోనియా గాంధీ అన్నారంటే, అందుకు ఎంతోకొంత అర్థముంది. ఆమె చేసింది ఏకపక్ష నిర్ణయమే అయినా పార్టీ ఆ నిర్ణయాన్ని స్వాగతించింది. శశికళ పరిస్థితి అది కాదు, ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంగీకరించేందుకు పార్టీలోని ఏ వర్గం కూడా సిద్ధంగా లేదు. అందుకే ఆమె, జెండాలు, శిలాఫలకాలు పట్టుకుని, నేనే నేనే అంటూ సొంతంగా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ స్మారక మందిరం వద్ద ఆమె ఆ పార్టీకి పోటీగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ‘ప్రధాన కార్యదర్శి వీకే శశికళ’ అని ఉన్న శిలాఫలకాన్ని ఆమెకు ఆమె ఆవిష్కరించుకున్నారు. ఇప్పుడా శిలాఫలకం వివాదంగా మారింది. 

శిలా ఫలకంలో  పేరేసుకుంటే ప్రధాన కార్యదర్శి కాలేరని మాజీ మంత్రి డి. జయకుమార్‌ శశికళకు  చురకలు అంటించారు అంతే కాదు, కోర్టులే తీర్పులు ఇచ్చిన తర్వాత శశికళ శిలాఫలకంలో ప్రధాన కార్య దర్శిగా తమ పేరేసుకోవడం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. అలాగే మీసమున్న వారంతా కట్టబ్రహ్మన్నలు కాలేరని సైటైర్లు కూడా విసిరారు. పచ్చని అన్నా డిఎంకే కుటుంబంలో శశికళ చిచ్చుపెట్టారని, అర్థం వచ్చేలా జయకుమార్ చాలా వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత మాత్రమేనని, ఈ విషయమై పార్టీ సర్వసభ్య మండలి సమావేశం సుస్పష్టమైన తీర్మానం కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు. 

అయితే,  ఒక్క సారి గతాన్ని గుర్తు చేసుకుంటే, చాలా వరకు ప్రాంతీయ పార్టీలలో ఇలాంటి కలహాలు సహజమే అనిపిస్తుంది. 1987లో ముఖ్యమంత్రి ఎమ్జీఆర్ చనిపోయిన సమయంలో, అన్నా డిఎంకేకు  ఇంతకంటే పెద్ద సంక్షోభమే  ఎదురైంది. ఎంజీఆర్ పార్టీలోని జయలలిత వ్యతిరేక వర్గం వత్తిడి తెచ్చి ఎంజీఆర్ సతీమణి జానకిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ సమయంలో జయలలిత వైపు ఉన్నది 30 మంది ఎమ్మెల్యేలే. జానకి వర్గంలో 101 మంది ఎమ్మెల్యేలున్నారు. అయినా జానకి ప్రభుత్వం 24 రోజులకే కూలి పోయింది. ముఖ్యమంత్రి జానకి అసెంబ్లీ విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో చివరకు సభ లోపలకు పోలీసులు, పోలీసు ముసుగులో ఉన్న గూండాలు వచ్చి నానా రచ్చ చేశారు. ఆ విధంగా  పార్టీ రెండుగా చీలి పోయింది. ఆ సమయంలో శశికళ, జయ వ్యతిరేక జానకి వర్గంలో ఉన్నారు..ఆ తర్వాత జయలలిత పార్టీ మీద పట్టు సాధించిన తర్వాతనే, శశికళ ఆమె పంచన చేరారు. ఆ తర్వాత కూడా జయలలిత, శశికళ మధ్య విభేదాలు రావడం శశికళ దూరంగా ఉండడం అదంతా చరిత్ర...ఇప్పుడు మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందా? మళ్ళీ పార్టీ ముక్కలవుతుందా? అంటే ..కాదనడం కష్టమే. ఎందుకంటే, శశికళ సామాన్యురాలు కాదు.