జగన్.. బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు సారూ!?

ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.

రాయిదాడి సంఘటనను హత్యా యత్నం అంటూ మీడియాలో వైసీపీ నేతల ప్రకటనలతో సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆ దాడిని ఖండిస్తూ  ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు,  జనసేనాని పవన్ కల్యాణ్ కూడా దాడి ఘటనను ఖండిస్తూ ప్రకట చేశారు. సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యకు కూడా డిమాండ్ చేశారు. సరే ఒకింత ఆలస్యమైనా సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యాలతో పాటు ఇతర ఫిర్యాదులను కూడా పరిగణననలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలిస్ పై బదలీ వేటు వేసింది. అక్కడకు ఆ అంకం ముగిసినట్లుగానే భావించాలి.

కానీ జగన్ లో మాత్రం ఆ దాడి నుంచి ఇంకా సానుభూతి పిండుకోవచ్చన్న దింపులు కళ్లెం ఆశ మిగిలే ఉన్నట్లుంది. అందుకే ఇప్పటికీ ఆయన నుదుటి మీద కనుబొమలను కవర్ చేసేలా బ్యాండ్ ఎయిడ్ ను అలాగే కొనసాగిస్తున్నారు. వాస్తవానికి రాయి తగిలిందని చెప్పి నుదురు పట్టుకున్న తరువాత జగన్ కు నుదుటిపై గుండ్రంగా ఒక చిన్న బ్యాండ్ ఎయిడ్ వేశారు. అయితే ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పదుల సంఖ్యలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్న తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ సైజు ఒక్క సారిగా పెరిగిపోయింది. నుదుటి భాగాన్నే కాకుండా కనుబొమను కూడా వకర్ చేస్తూ పెద్ద బ్యాండ్ ఎయిడ్ ఇప్పుడు ఆయనకు సహజ కవచకుండలంగా మారిపోయి కనిపిస్తున్నది. 

హత్యాయత్నం అని వైసీపీ ఎంతగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించినా జనం నమ్మలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే కాదు చివరాఖరికి సొంత చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్ పై జరిగింది గులకరాయి దాడే అని పదే పదే చెబుతున్నారు. సరే అది పక్కన పెడితే గాయం తగిలి ఇన్ని రోజులైనా వైద్యులు ఇంకా జగన్ నుదుటిపై ఉన్న బ్యాండ్ ఎయిడ్ ను ఎందుకు తీయలేదా అని వైసీపీ శ్రేణుల్లోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా సానుభూతి కోసమే ఇబ్బంది అయినా బ్యాండ్ ఎయిడ్ ను అలా భరిస్తూ కొనసాగిస్తున్నారా అన్న జోకులు కూడా పేలుతున్నాయి. ఇక ఆంధ్రాలో అయితే జగన్ స్టైల్ లో నుదుటిమీద బ్యాండ్ ఎయిడ్ పెట్టుకుంటూ యూత్ ఓ లెవల్ లో  ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసే దాకా జగన్ నుదుటిమీద ఆ బాండ్ ఎయిడ్ ను అలా ఓ ఆభరణంలా మెయిన్ టెయిన్ చేస్తారేమో అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు.