వైసీపీ అధ్యక్ష రేసులో రఘురామకృష్ణ రాజు! 

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైసీపీ ప్రెసిడెంట్ గా కూడా ఈయన కొనసాగుతున్నారు. అన్ని పార్టీల్లోనూ రెండు, మూడేండ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. గత 20 ఏండ్లుగా టీఆర్ఎస్ చీఫ్ గా ఉన్న కేసీఆరే.. మరోసారి ప్రెసిడెంట్ కాబోతున్నారు. 

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి సంబంధించి తాజాగా ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు.. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికపై సంచలన కామెంట్లు చేశారు. సీఎం జగన్ కు పోటీగా.. వైసీపీ అధ్యక్ష పదవికి తాను పోటీ పడతానని ప్రకటించారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు ఎంపీ రఘురామ రాజు. తాను క్రమశిక్షణ గల కార్యకర్తనని... అందుకే తనను ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని చెప్పారు. తనపై వైసీపీ నేతలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిప్డడారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు రఘురాజు లేఖ రాశారు. తనపై వైసీపీ ఎంపీలు ఇచ్చిన అనర్హత పిటిషన్ ను కొట్టివేయాలని లేఖలో కోరారు. 

వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ రాజు.. కొన్ని నెలలుగా ఆ పార్టీలో రెబెల్ గా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అంతేకాదు ఏకంగా సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి వైసీపీలో కలకలం రేపారు. తాజాగా వైసీపీ అధ్యక్ష ఎన్నికపై ఆయన చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. రఘురామ రాజు వైసీపీకి దూరంగా ఉంటున్నా.. లోక్ సభ రికార్డుల ప్రకారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనే.  వైసీపీ ఆయన్ను అధికారికంగా సస్పెండ్ చేయలేదు. దీంతో ఆయన వైసీపీ కిందే లెక్క. సో.. వైసీపీ కార్యకర్తగా తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని రఘురామ రాజు చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.