సెల్ మార్చండి... ఇళవరసితో ఉండలేను..!
posted on May 3, 2017 5:47PM
.jpg)
అక్రమాస్తుల కేసులో భాగంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి అయిన శశికళ బెంగుళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా శశికళ తోపాటు ఆమె మరదలు అయిన ఇళవరసి కూడా అదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ జైలులో ఇద్దరూ ఒకే సెల్ లో ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు శశికళను వేరే సెల్ లోకి మార్చినట్టు తెలుస్తోంది. శశికళ కోరిక మేరకే జైలు అధికారులు ఈ పని చేసినట్టు సమాచారం. తమ మరదలు ఇళవరసితో కలిసి తాను ఒకే సెల్ లో ఉండలేనని పోలీసు అధికారులకు చెప్పడంతో ఆమెను నాలుగో నంబర్ సెల్ కు మార్చారు. ఈ సెల్ లో ఆమె ఒక్కరే ఒంటరిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా తనను చూడటానికి వస్తున్న బంధువులను కూడా అందరినీ కలవడానికి శశికళ సముఖత చూపించడంలేదని.. ఏదో కొంతమందినే కలుస్తున్నారని చెబుతున్నారు. దీనికి తన పేరు మీద ఉన్న ఆస్తులు తమ పేరున రాయించాలంటూ కుటుంబసభ్యులు కొంతమంది ఒత్తిడి తీసుకొస్తుండటమే కారణం అంటున్నారు.