'సమ్మెను విరమింపచేసినందుకే కేసీఆర్కు టెండర్లు'
posted on Nov 11, 2011 12:08PM
హైదరా
బాద్ : సకల జనుల సమ్మెను విరమింపచేసినందుకే కేసీఆర్కు పోలవరం టెండర్లు బహుమతిగా ఇచ్చారని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు శుక్రవారం గవర్నర్ను కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వినతి పత్రం సమర్పించారు.భేటీ అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ పోలవరం టెండర్ల అవకతవకల్లో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర ఉందని ఆరోపించారు. జరిగిన అక్రమాలను నిరూపిస్తామన్నా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు స్పందించటం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీకి తాము ఒప్పుకునేది లేదని హైదరాబాద్తో కూడిన తెలంగాణయే కావాలని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఎర్రబెల్లి అన్నారు. అయితే దానికన్నా ముందు కేసీఆర్ మరియు జగన్ వర్గ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి అవిశ్వాస తీర్మానం కోరాలని ఆయన డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానం అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు తాము సభకు హాజరు కావాలా వద్దా అనేది ఆలోచిస్తామన్నారు. తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ సారధ్యంలో ఓ స్వతంత్ర సంస్థ ఏర్పడాలని అభిప్రాయపడ్డారు.