ఉద్యోగులతో సజ్జల మైండ్ గేమ్?!
posted on Feb 5, 2022 10:01AM
ఓపెన్ మైండ్ తో ఉన్నాం.. చర్చలకు రండి.. రండి.. అంటూ ఉద్యోగులకు బహిరంగ ఆఫర్ ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓ పక్క క్రమశిక్షణ చర్యలు తప్పవని బెదిరిస్తూనే.. మరోపక్క చర్చల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారంటున్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో వేలుపెట్టి రాష్ట్రం అధోగతి పాలు కావడానికి ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ ఆయనే కారణమంటూ ఉద్యోగులు సజ్జలపై ఫైరవుతున్నారు. అయినా.. సీఎం జగన్ రెడ్డి మాత్రం మళ్ళీ మళ్లీ ఆయన్నే చర్చలకు పంపడం వెనుక పరమార్ధం ఏంటని కింది స్థాయి ఉద్యోగులు గుస్సా అవుతున్నారు.
ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ లాగానే ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ తెచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆటలు ఇక సాగేట్టు కనిపించడం లేదు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. ఉద్యోగులను కూడా అలాగే కన్ఫ్యూజ్ చేయాలని అనుకున్నట్టున్నారు కాబోలు సజ్జల.ఆయన వ్యూహం బెడిసికొట్టింది. పీఆర్సీపై ఒక వైపున జీఓలు ఇచ్చి, వాటి ప్రకారమే జీతాలు వేసి.. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం రండి అంటూ సజ్జల ఆడుతున్న మైండ్ గేమ్ ఉద్యోగులను మరింత రెచ్చగొట్టేలా ఉందంటున్నారు. అర్ధరాత్రి తీసుకొచ్చిన జీఓను రద్దు చేయాలని ఉద్యోగులు, సంఘాలు మొత్తుకున్నా ఆ దిశగా అడుగులు వేయడంలేదు. సరికదా చర్చలకు రండి అంటూ కాలయాపన చేస్తు న్న సజ్జల కమిటీ ఉద్యోగుల సమస్యలపై పెద్ద కుట్ర చేస్తున్నారని అర్ధమవుతుందంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆర్థిక మంత్రి, చీఫ్ సెక్రటరీ నేత్రుత్వంలో చర్చలు జరపాలి. అలా కాకుండా ఏ సంబంధమూ లేని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇందులో వేలుపెట్టడం వల్లే ఇంత రచ్చ కు దారి తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జర్నలిస్టు గా పనిచేసిన సజ్జల.. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగ చట్టాలపై అనేక కథనాలు రాశారు. అలాంటి సజ్జల ఉన్నట్టుండి ప్రభుత్వ సలహాదారు కావడంతో ఇప్పుడు గతం గుర్తుకు రావడం లేదా అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పటికీ పీఆర్సీపై పట్టుదలతో ఉంటూ ఉద్యోగులను రకరకాలుగా ఆందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు.
అయితే.. ఉద్యోగులు కూడా పీఆర్సీ సాధన విషయంలో అదే ఉడుంపట్టుతో ఉన్నారు. సజ్జల కమిటీ చెప్పే వింత వాదనలకు సమాధానం చెబుతూనే.. ఉద్యమ కార్యాచరణను ముందుకు నడిపిస్తున్నారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పీఆర్సీ సమస్య పరిష్కరించకపోతే ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని అంతకు ముందే నోటీసులు కూడా ఇచ్చారు. మరోపక్కన శుక్రవారం పెన్ డౌన్, సర్వర్ డౌన్ చేసి సమ్మె తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సలహాదారు సజ్జల తీరు ఇప్పటికైనా మారకపోతే ఏపీలో ఆందోళన మరింత ఉధృతం అయ్యేలా ఉంది. సమ్మె అనివార్యం అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సమ్మె జరిగితే.. వ్యవస్థలు పనిచేయకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవడమే కాకుండా ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడక తప్పదంటున్నారు. ఉద్యోగుల సెంటిమెంట్ తో గెలుక్కుని ఎంత చేటు చేస్తున్నావు సజ్జలా అంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందిప్పుడు.