సజ్జలకు కౌంట్ డౌన్?.. ఇదే ఆయ‌న బ్యాక్‌గ్రౌండ్‌...

పెరుగుట విరుగుట కొరకే ... ఇదొక సామెత. నలుగురికీ తెలిసిన సామెత. ముఖ్యంగా రాజకీయాల్లో నడిమంత్రపు సిరిలా ఏదో కలిసి వచ్చి, అందలం ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఎక్కినంత వేగంగా దిగిరాక తప్పదు. ఇది చరిత్ర. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, అందుకు మినహయింపు కాదు. 

నిజానికి ఒక జర్నలిస్ట్’గా, వ్యాపారవేత్తగా ఎదిగొచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి గతం గురించి తెలిసిన ఎవరైనా, ఆయనొక జెండిల్మాన్, మంచి మనిషి అనే అంటారు. అయితే, రాజకీయ అరంగేట్రం తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఏడడుగులు కలిసి నడిస్తే వారు వీరవుతారని, జగన్ రెడ్డితో కలిసి నడవడంలోనే సజ్జలలో మార్పు వచ్చిందని, మాజీ మిత్రులు చర్చించు కుంటున్నారు.  
సరే, అదలా ఉంచి, ప్రస్తుతంలోకి వస్తే, వైసీపీలో నెంబర్ 2 పొజిషన్’లో ఉన్నవిజయ సాయి రెడ్డిని ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడంతో తెరపైకొచ్చిన సజ్జల, ఇక అక్కడ నుంచి, జగన్ రెడ్డి కళ్ళు, చెవులు అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. అన్ని శాఖలకు ఆయనే మంత్రి అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. ఆల్ ఇన్ వన్ సలహాదారుగా అవతరం ఎత్తారు.  

ఈ నేపధ్యంలో,  పీఆర్సీ విషయంలోనూ ఆయన, కొంత అతి ఉత్సాహం చూపించారు. నిజానికి ఒక దశలో ఆయన తెర చాటుకు వెళ్లి పోయారు.అయితే, ఎప్పుడైతే వివాదం ముదిరి, పీటముడి బిగుస్తూ వచ్చిందో, అప్పుడు మంత్రులు పక్కకు తప్పుకోవడంతో సజ్జల మళ్ళీ తెరమీదకు రాక తప్పలేదని, తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం. ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇన్ వన్’గా అన్ని వ్యవహారాలు ఆయనే చూస్తున్నారు.
అదలా ఉంటే, చలో విజయవాడ సక్సెస్’ తో ఉద్యోగ సంఘాల్లో జోష్ పెరిగితే, ఇంట బయటా విమర్శలు ఎదుర్కోవడం సజ్జల వంతైంది. ఇప్పటికే ఉద్యోగుల విషయంలో సజ్జల వ్యవహరించిన తీరు పట్ల సర్కార్ సర్కిల్స్’ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు అధికారులు, ఇటు మంత్రులు ఇతర్ నాయకులు కూడా సజ్జల ఉద్యోగులను అవమానించడం వల్లనే పరిస్థితి ఇంత దూరం వచ్చిందని అంటున్నారు. 
ఈ క్రమంలో ఉద్యోగులు కూడా తమ సమస్యలపై మాట్లాడుతున్న సజ్జల ఎవరు ? అతనికి ఉన్న అధికారం ఏమిటి అని ప్రశ్నించడంతో .. అవును అసలు సజ్జల ఎవరు? అనే ప్రశ్న పార్టీ సర్కిల్స్’లో కూడ వినిపిస్తోంది. మరో వంక ఇంతకాలం ముఖ్యమంత్రి గుడ్’లుక్స్ లో ఉన్నారనే భావనతో ఆయనకు గౌరవం ఇస్తున్న మంత్రులు, ఇతర సీనియర్ నాయకులు, సజ్జల ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఇదే సరైన సమయమని ఆ దిశగా పావులు  కదుపుతున్నట్లు సమాచారం.ముఖ్యంగా అక్రమాస్తుల కేసుల మొదలు అన్నిటా నెంబర్ 2గా ఉంటూ వచ్చిన విజయసాయి రెడ్డి తన ఆధిపత్యాన్ని దెబ్బ తీసిన సజ్జలపై, గుర్రుగా ఉన్నారు. విజయ సాయితో పాటుగా ఇంకొందరు  సజ్జల బాధితులు  అవకాశం కోసం ఎదురు చుస్తున్నారని పార్టీ వర్గాల్లో వినవస్తోది.ఈ నేపధ్యంలో సజ్జల కౌంట్ డౌన్ స్టార్ అయినట్లే అంటున్నారు. జగన్  రెడ్డి కూడా అవసరం తీరింది అనుకుంటే ఎవరిని అయినా కరివేపాకులా తీసి అవతల పారేస్తారు.కన్న తల్లి, తోడ బుట్టిన చెల్లి విషయంలోనే, కరివేపాకు థియరీ పాటించిన ఆయనకు, సజ్జల ఒక లెక్కా అన్న మాట కూడా వినిపిస్తోంది.  రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu