ఆర్జీవీ వ్యూహం.. తెరపైకి భారతి!

మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అలాంటి వేళ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో  జగన్ బయోపిక్.. వ్యూహాత్మకంగా తెరకెక్కుతోంది. 
అయితే ఈ చిత్రంలోని పలు సన్నివేశాలకు చెందిన నాలుగు ఫొటోలను రామగోపాల్ వర్మ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో   జగన్‌గా అజ్మల్... ఆయన భార్య   భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్   నటిస్తున్నారు. ఈ ఫొటోల్లో... వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర ఫటంలో.. ఆజ్మల్, మానస రాధాకృష్ణన్ కనిపించీ కనిపించకుండా ఉన్నారు. ఇక రెండో చిత్రంలో అజ్మల్ ఆందోళనతో ఏదో  చెబుతుండగా.. అతడి మొఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఆందోళనను భారతీ పాత్రలో మానస రాధాకృష్ణన్ తీవ్ర ఆవేదనతో గమనిస్తున్నట్లుగా ఉంది. ఇక మరో ఫొటోలో అజ్మల్‌కు ఫోన్ రావడం.. మానస.. ఆందోళనతో మంచంపై నుంచి లేచి కూర్చొవడం.. వంటి ఫోటోలు వదిలారు.

అయితే   వీరిద్దరు ఇంత ఆందోళనతో ఉండడాన్ని బట్టి చూస్తే.. ఇది వైఎస్ జగన్   చిన్నాన్న వైయస్ వివేక హత్య జరిగిన సమయంలో వచ్చిన ఫొన్ కాల్‌గా నెటిజన్లు భావిస్తున్నారని వారి కామెంట్లను బట్టి అవగతమౌతోంది.  మరోవైపు ఈ చిత్రం అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్దం అంటూ క్యాప్షన్   పెట్టారు. మరోవైపు ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్.. బయోపిక్‌లో అబద్దాలు ఉండొచ్చు కానీ.. రియల్ పిక్‌లో వందకి వందశాతం నిజాలే ఉంటాయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం విదితమే. ఇంకోవైపు ఈ చిత్ర షూటింగ్ శరవేగంతో జరుపుకొంటోంది. ఈ చిత్రం ఎన్నికల నాటికి విడుదల చేసి.. లబ్ధి పొందాలన్న లక్ష్యంతో  జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం రెండో భాగం తెరకెక్కనుందని.. ఆ చిత్రానికి శపథం పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.  

ఇక మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి.. అధికారంలోకి రావడంతో.. మహీ వి. రాఘవ దర్శకత్వంలో యాత్ర పేరుతో మమ్ముటి నటించిన చిత్రం 2019 ఎన్నికలకు ముందు విడుదలై.. ఘన విజయం సాధించింది. అలాగే వైయస్ఆర్ మరణం తర్వాత ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ పాదయాత్ర సైతం చేశారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మహీ వి రఘవ దర్శకత్వంలో యాత్ర 2 పేరుతో చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.  

ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత అమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ చిత్రాన్ని సైతం తెరకెక్కించారు.  మరి ఎన్నికల వేళకు ఈ వ్యూహాం చిత్రం పూర్తయి.. ప్రజల ముందుకు వస్తుందా? వస్తే.. జగన్ పాదయాత్రలో నాడు ఇచ్చిన హామీలు.. ఆయన గద్దెనక్కిన తర్వాతా అంటే.. ఈ నాలుగేళ్లలో పుల్ ఫిల్ చేసేశారా? అనేది.. చిత్రం విడుదలై.. ప్రజలు ఎలా రిసివ్ చేసుకొంటారనే ఓ చర్చ జోరుగా సాగుతోంది.