పని మొదలెట్టేశారు!.. అధికారులు ఆ వేగం అందుకోగలరా?
posted on Dec 9, 2023 8:49AM
పని చేసే ప్రభుత్వం వేగం ఎలా ఉంటుందో.. ప్రజలకు, రాష్ట్రానికీ సేవ చేయాలన్న సంకల్పం ఉండే సీఎం తీరు ఎలా ఉంటుందో.. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతలలో చూపిస్తున్నారు. ఒకే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు, అవకతవకలపై సీరియస్ గా చర్యలకు ఆదేశిస్తూనే, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చర్యలూ తీసుకుంటున్నారు.
అదే సమయంలో మంత్రివర్గం కొలువుదీరిన ఒక రోజు వ్యవధిలోనే కేబినెట్ భేటీ నిర్వహించి గత తొమ్మిదేళ్లలో గత ప్రభుత్వ ఖర్చులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన వివరాలను రెడీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ వేగం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఆ వేగం అందుకోగలమా అంటూ కంగారు పడుతున్నారు.
ఇక తొలి క్యాబినెట్ భేటీలో ఆరు గ్యారెంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చిచడమే కాకుండా. రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఆ రెండు గ్యారంటీలనూ కూడా తెలంగాణ ఇచ్చిన అమ్మగా సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా అంటే శనివారం (డిసెంబర్ 9) నుంచి అమలు చేయడానికి నిర్ణయించేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకూ పేదలకు వైద్యం హామీల అమలు శనివారం (డిసెంబర్ 9) నుంచి మొదలైపోయాయి. ఇక మిగిలిన ఆరు గ్యారంటీలనూ కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని కేబినెట్ తొలి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.