కాంగ్రెస్‌లో కాక రేపుతున్న‌ హుజురాబాద్.. రేవంత్‌రెడ్డినే కార్న‌ర్‌!

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. గ‌త ఎన్నిక‌లో మెరుగైన రీతిలో ఓట్లు సాధించుకున్న హ‌స్తం పార్టీ.. ఈ సారి అతిత‌క్కువ ఓట్ల‌కే ప‌రిమిత‌మ‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. పార్టీ కోసం బ‌లంగా వాయిస్ వినిపిస్తున్న‌ యువ‌జ‌న‌ నాయ‌కుడు వెంక‌ట్‌ను అభ్య‌ర్థిగా నిలిపినా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చివ‌ర్లో ప్ర‌చారం చేప‌ట్టినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు వేయండంటూ రేవంత్ చేసిన విజ్ఞ‌ప్తిని హుజురాబాద్ వాసులు అస్స‌లు ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. అందుకే, కాంగ్రెస్‌కు అతి త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థి కౌశిక్‌రెడ్డి 70వేలకు పైగా ఓట్లు కొల్ల‌గొట్టి.. ఈట‌ల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు.ఈసారి కౌశిక్‌రెడ్డి లేడు.. పార్టీకి ఆద‌ర‌ణా లేదు. అందుకే, హుజురాబాద్‌లో హ‌స్తం గుర్తు ఆగ‌మాగ‌మైంది. 

ఇదే అద‌నుగా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని వేలెత్తి చూపుతున్నారు కాంగ్రెస్‌లోని కొంద‌రు. రేవంత్‌కు రెబ‌ల్‌గా మారిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి హుజురాబాద్ ఓట‌మికి రేవంత్‌రెడ్డినే కార‌ణ‌మంటూ కార్న‌ర్ చేశారు. ‘ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ నుంచి ఒక్క సభ కూడా పెట్టలేదు. దుబ్బాక, నాగార్జున సాగర్ లో పని చేసినట్లుగా హుజురాబాద్‌లో కాంగ్రెస్ పని చేయలేదు. కాంగ్రెస్‌కు హుజురాబాద్‌లో గట్టి క్యాడర్ ఉంది. అయినా తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రయత్నం చేయలేదు. హుజూరాబాద్‌పై వాస్తవ పరిస్థితి ని హైకమాండ్ కు వివరిస్తా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దు’ అంటూ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

అటు మ‌రో సీనియ‌ర్ నేత‌, రేవంత్‌తో స‌ఖ్య‌త‌గా ఉండే పొన్నం ప్ర‌భాక‌ర్ సైతం హుజురాబాద్ ఓట‌మిపై స్పందించారు. ‘కాంగ్రెస్ ఓటమి ఊహించిందే. ఉత్తమ్ పీసీసీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి మీద దృతరాష్ట్రుడి ప్రేమ చూపించారు. అది పార్టీకి నష్టం చేసింది. రేవంత్ రెడ్డి వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయారు.’ అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

ఇలా హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఓట‌మిపై అప్పుడే లుక‌లుక‌లు బ‌య‌లుదేర‌డం.. అవ‌న్నీ రేవంత్‌రెడ్డి వైపే గురిపెట్ట‌డం చూస్తుంటే.. హ‌స్తం నేత‌ల‌ తీరు అస‌లేమాత్రం మార‌లేద‌నే మాట వినిపిస్తోంది. మ‌రి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటూ.. హ‌స్త రేఖ‌లు ఎలా మార్చేస్తారో చూడాలి..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu