గెలుపు ఈటలదా? బీజేపీదా? క్రెడిట్ ఎవరి ఖాతాలోకి?
posted on Nov 2, 2021 4:03PM
హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం. హోరాహోరీ అనుకుంటే.. వార్ వన్ సైడెడ్‌గా సాగింది. కేసీఆర్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఫలితం వచ్చింది. రాజ్యం కుట్రలు, కుతంత్రాలు, తాయిలాలూ, పథకాలు, బలగాలు, డబ్బు మూటలు.. అసలేవీ పారలేదు. కారును హుజురాబాద్ పొలిమేరల దాకా తరిమికొట్టారు ఓటర్లు. ఇంతకీ హుజురాబాద్‌లో ఇంతటి సంచలన విజయం ఎవరి ఖాతాలోకి? ఈ ఘనత ఈటల రాజేందర్‌దా? బీజేపీదా?
చెప్పడం కాస్త కష్టమే అయినా.. ఈజీగానే చెప్పేయొచ్చు అంటున్నారు విశ్లేషకులు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారం అంతా ఈటల పేరు మీదుగానే సాగింది. రాజేందర్ చుట్టూనే తిరిగింది. కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్టుగానే జరిగింది. హుజురాబాద్-ఈటల అనుబంధంపై సెంటిమెంట్ రాజుకుంది. జై ఈటల.. జైజై ఈటల అంటూ ప్రచారం మారుమోగింది. అక్కడక్కడా.. అప్పుడప్పుడు మాత్రమే జై బీజేపీ.. జై మోదీ వినిపించిందని అంటారు. అందుకే, టీఆర్ఎస్ సైతం ఇదే విషయాన్ని తన ప్రచారంలో పదే పదే ప్రస్తావించింది.. బీజేపీ, మోదీ పేరు లేకుండా ఈటలతోనే ప్రచారం కానిచ్చేస్తున్నారని ఆరోపించింది. ఓ వర్గం ఓట్లు పడవనే భయంతోనే.. గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు వల్లే బీజేపీ ప్రస్తావన పెద్దగా లేకుండా.. ఈటల ఫేస్ మీదుగానే రాజకీయం నడిపించేశారని చెబుతారు. ఆ స్ట్రాటజీ బాగానే వర్కవుట్ అయి.. ఈటల మంచి మెజార్టీతో గెలుపొందారు కాబట్టి ఈ క్రెడిట్ అంతా ఈటల రాజేందర్‌దే అంటున్నారు కొందరు.
అయితే.. పైపైన చూస్తే ఈటలనే ప్రముఖంగా కనిపించినా.. ఆయన గెలుపు కోసం బీజేపీ కేడర్ అవిశ్రాంతంగా పని చేసిందని చెబుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు హుజురాబాద్‌లో వారాల తరబడి మోహరించి ఈటల కోసం కష్టపడ్డారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో బీజేపీ చాలా స్ట్రాంగ్. మండలాలు, గ్రామాలు, వార్డులు, బూత్‌ల వారీగా కమిటీలు వేసుకొని.. బాధ్యతలు అప్పగించింది పార్టీ. కమలనాథులంతా చిత్తశుద్ధితో ఈటల కోసం వర్క్ చేశారు. ఇక, బీజేపీ జాతీయ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన వీ6 న్యూస్ ఛానెల్, వెలుగు పేపర్‌లో ఎప్పటికప్పుడు ఈటల ప్రమోషన్‌తో పాటు టీఆర్ఎస్ యాంటీ న్యూస్ ఇవ్వడం.. ఈటలకు బాగా కలిసొచ్చింది. ఇటు బండి సంజయ్ పాదయాత్ర, అటు రఘునందన్‌రావు లాంటి వారి విస్తృత ప్రచారం.. ఇలా బీజేపీ శక్తి-యుక్తులంతా ఈటల రాజేందర్‌కు బాగా బూస్ట్ నిచ్చాయి. అందుకే, అధికారపార్టీ అంతగా ప్రయత్నించినా.. ఈటల గెలుపును అడ్డుకోలేకపోయిందని అంటున్నారు. సో.. హుజురాబాద్ క్రెడిట్ బీజేపీకీ దక్కుతుంది. అందుకే.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం.. ఇటు ఈటలకు.. అటు బీజేపీకి సమానంగా ఇవ్వడమే సమంజసం అంటున్నారు విశ్లేషకులు.