రేవంత్, ఎర్రబెల్లి.. కోల్డ్ వార్ ముగిసిందా?

 

తెలంగాణ  తెలుగుదేశం పార్టీలో కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.  ఏపీ సీఎం చంద్రబాబు టీ టీడీపీ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారా లేదా ఎర్రబెల్లికి అప్పగిస్తారా అన్న నేపథ్యంలో ఈ ఆధిపత్యపోరు బయటపడింది. అసలు ఒకే పార్టీ అయినా రేవంత్ రెడ్డికి.. ఎర్రబెల్లికి ఎప్పటినుండో సఖ్యత లేదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకానొక సందర్బంలో ఈ ఇరువురు నేతలు మధ్య మాటలు కూడా తగ్గిపొయాయి. ప్రత్యక్షంగా ఒకరినొకరు తిట్టుకోకపోయినా పరోక్షంగా మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే జరుగుతూనే ఉండేది. అది ఇప్పుడు ఇంకోసారి బహిర్గతం అయింది.

అయితే నిన్నటి వరకూ వీరిద్దరి మధ్య ఉన్న పోరు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందంటున్నాయి రాజకీయ వర్గాలు. వీరిద్దరి మధ్య రాజీ కుదిరిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి ఇచ్చినా తాను మాత్రం ఎర్రబెల్లికి ఇప్పుడున్న పెద్దరికపు హోదానే కొనసాగిస్తానని చెప్పడం.. ఆ విషయంలో తాను పోటీపడనని.. చెప్పడంతో ఎర్రబెల్లి కూడా సమాధానపడినట్టు తెలుస్తోంది. అంతేకాక టీఆర్ఎస్ పై రేవంత్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు కూడా చెప్పడంతో తాను కూడా దీనికి ఓకే చెప్పినట్టు సమాచారం.

కాగా మరోవైపు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై పోరాడినట్టు ఎర్రబెల్లి తాను పోరాడలేనని తెలిసే తాను ఈ ఒప్పందానికి అంగీకరించారని.. కేవలం రేవంత్ కు మద్దతు తెలిపేందుకు సిద్దమయ్యారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు. మొత్తానికి కారణమేదైనా ఇద్దరు నాయకుల మధ్య ఉన్న ఆ ఆసఖ్యత పోవడం పార్టీకే లాభదాయకం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu