సెప్టెంబర్ 17 వివాదానికి రేవంత్ ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనా?

తెలంగాణకు సంబంధించినంత వరకూ  సెప్టెంబర్ 17 వ తేదీకి ఉన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.  ఎందుకంటే అదే తేదీన నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యం   భారత యూనియన్  అధీనంలోకి వచ్చింది. అయితే  మొదటి నుంచి హైదరాబాద్ సంస్థానం భారత్ లో  విలీనమైన రోజును గుర్తించే విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.  విమోచననా , విలీనమా , విద్రోహమా అనే చర్చ ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ చర్చకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేసినట్లుగానే కనిపిస్తోంది. రేవంత్ నిర్ణయం ఆయన రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిరుత్తురులను చేసేసిందనే చెప్పాలి. రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సెప్టెంబర్ 17ను విమోచన దినం, విలీనదినం అన్న వివాదం జోలికి వెళ్లకుండా హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిపోయిన తేదీని   ప్రజా పాలనా దినోత్సవంగా పరిగణిస్తామని ప్రకటించడం ద్వారా సెప్టెంబర్ 17 చుట్టూ ఉన్న వినవాదానికి తెరదించేశారనే చెప్పాలి.  

హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని ప్రాంతాలు రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా కర్ణాటకలోనూ కలిశాయి. దాంతో కర్నాటక ప్రభుత్వం ఆ తేదీని అధికారికంగా గుర్తించింది.  అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వాలు గానీ, రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలంగాణ కానీ  విమోచన పేరు మీద కానీ, విలీనం పేరుతో కానీఉత్సవాలు నిర్వహించ లేదు. అందుకు కారణాలు లేకపోలేదు. 

బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన విముక్తి లభించింది. అయితే హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం భారత యూనియన్ లో విలీనం చేయడానికి నిరాకరించారు. స్వతంత్ర రాజ్యం గుర్తింపు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే హైదరాబాద్   విలీనం చేసుకోవడానికి భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సైనిక చర్యకు దిగింది. దాంతో నిజాం 1948 సెప్టెంబర్ 17వ తేదీన సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్  ముందు లొంగిపోయారు. అయితే, కమ్యూనిస్టులు 1951 అక్టోబర్ 20వ తేదీ వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 

భారత యూనియన్ సైనిక చర్య వెనక కేవలం నిజాం ప్రభువును లొంగదీసుకోవడమే కాదు, కమ్యూనిస్టు లను అణచివేసే వ్యూహం, ప్రణాళికా  కూడా ఉంది.  అందులో భాగంగానే నిజాం ప్రభువును లొంగదీసుకుని భారత యూనియన్ లో విలీనం చేసుకుని కమ్యూనిస్టులను తుడిచిపెట్టే చర్యకు దిగింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా జరపాలని బిజెపీ డిమాండ్ చేస్తూ వస్తున్నది.  
అయితే, బిజెపికి తెలంగాణ పోరాటంతో ఏ మాత్రం సంబంధం లేదని, అందుకే ఆ పార్టీకి విమోచన దినోత్సవంగా జరిపే హక్కుల లేదన్నది వామపక్షాల వాదన.  

విమోచన దినోత్సవంగా అధికారికంగా గుర్తించడానికి అధికారంలో ఉంటూ వచ్చిన అన్ని పార్టీలకు కూడా చిక్కులు తెచ్చి పెట్టే విషయమే. మజ్టీస్ లేదా ఎంఐఎం విమోచన దినంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తుంది. మెజారిటీ ముస్లింలకు కూడా అది మింగుడు పడని విషయం. ముస్లింల ఓటు బ్యాంక్ ను కోల్పోతామనే భయంతో అధికారంలో ఉన్న పార్టీలు సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా నిర్వహించడానికి సిద్ధంగా లేవు. ఇందుకు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అతీతం కాదు. అయితే, సెప్టెంబర్ 17వ తేదీని ఏదో రూపంలో గుర్తించాల్సిన పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిలోనే సెప్టెంబర్ 17వ తేదీన ప్రజా పాలనా దినోత్సవంగా పరిగణిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  మొత్తం మీద, సెప్టెంబర్ 17వ తేదీకి ప్రాముఖ్యం ఇస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన  వివాదానికి తెరదింపేసిందనే భావించవచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu