చెన్నైలో ఏ.పీ.యస్.ఆర్.టీ.సి. బస్సులపై దుండగుల దాడి

 

చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో నిన్న తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో తమిళనాడుకి చెందిన 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు చనిపోయారు. వారిలో 12మంది సాధారణ కూలీలని, వారు డబ్బుకు ఆశపడి స్మగ్లర్లతో వెళ్లి అన్యాయంగా బలయిపోయారని వాదిస్తున్న తమిళనాడులో రాజకీయపార్టీలు చెన్నైలో నిరసన ర్యాలీలు మొదలుపెట్టాయి. చెన్నైలో కోయం బేడ్ బస్ కాంప్లెక్స్ లో నిలిచి ఉన్న ఏపీయస్.ఆర్.టీ.సి.కి చెందిన బస్సులపై గుర్తు తెలియని దుండగులు దాడులు చేసి బస్సుల అద్దాలు పగులగొట్టారు. చెన్నైకి వెళుతున్న మరో ఏపీయస్.ఆర్.టీ.సి.బస్సుపై కూడా నెల్లూరు జిల్లా తడ మండలం పూడి గ్రామం వద్ద దుండగులు దాడి చేసి బస్సులో ప్రయాణికులు ఉండగానే పెట్రోల్ బాంబు విసిరిపారిపోయారు. ఈ సంఘటనలతో అప్రమత్తమయిన ఏపీయస్.ఆర్.టీ.సి. అధికారులు తమిళనాడుకు వెళ్ళే బస్సులన్నిటినీ తాత్కాలికంగా నిలిపివేశారు.

 

ఎర్ర చందనం స్మగ్లర్లు తమపై ఎదురుదాడికి పాల్పడినందునే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము తప్ప ఎవరినీ చంపాలనే ఉద్దేశ్యంతో కాల్పులు జరపలేదని ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసు మరియు అటవీశాఖ అధికారులు వాదనలను తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ పై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసి ఈ సంఘటనపై రెండు వారాలలో సంజాయిషీ ఇవ్వవలసినదిగా ఆదేశిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర డీజీపికి నోటీసులు జారీ చేసింది.