బాబు ఆదేశాలను బేఖాతర్ చేసిన గంటా.. జనసేన లాంగ్ మార్చ్ కు డుమ్మా

 

జనసేన లాంగ్ మార్చ్ టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంగ్ మార్చ్ కు హాజరుకావాలని టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశించినప్పటికి రాకపోవటంతో ఆయన టీడీపీని వీడాలని గంటా డిసైడయ్యారనే పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఉన్న వ్యక్తిగత విబేధాలే కారణమని కొందరు వాటిని తోసిపుచ్చుతున్నారు. 

విశాఖలో ఏ పార్టీ నుండి పోటీ చేసినా గెలుపు మాత్రం గంటాదే. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన గంటా ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచారు. అప్పట్నుంచీ గంటా ఏ పార్టీ లోకి వెళ్తారా అనే ఆసక్తి  రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓసారి వైసీపీ లో చేరుతారని.. మరోసారి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకూ గంటా మాత్రం తన మనసులో మాటను బయటపెట్టలేదు. అధినేత ఆదేశించినా లాంగ్ మార్చ్ కి హాజరు కాకపోవడంతో మరోసారి గంటా దారెటు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గంటా పార్టీ మారతారా మారితే ఏ పార్టీ ఇదే అంశానికి సంబంధించి పలు అనుమానాలు వెల్లడవుతున్నాయి. గత కొంతకాలంగా గంటాని చూసినట్లయితే ఒక ప్రణాళికతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు గానే చెప్పొచ్చు. 

పవన్ కళ్యాణ్ స్వయంగా టీడీపీని కూడా  కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వనించారు. దానికి టీడీపీ స్పందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా అటు మాజీమంత్రులైన చింతకాయల అయ్యన్న పాత్రుడుతో పాటు గంటా శ్రీనివాసరావును, అచ్చెన్నాయుడుని పాల్గొవాలని ప్రత్యేకంగా ఆదేశించారు. అధినేత ఆదేశం సైతం బేఖాతర్ చేస్తూ ఆయన నిన్న కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు టిడిపిలో ఇటు పొలిటికల్ సర్కిల్ లోనూ పెద్ద హాట్ టాపిక్ గా మారింది.నిన్న గంటా విశాఖలో అందుబాటు లోనే ఉన్నారు.. అయినా కావాలనే గైర్హాజరైన పరిస్థితి కనిపిస్తుంది.

పవన్ కల్యాణ్ తో కూడా గంటాకు చిన్న గ్యాప్ ఏర్పడింది. మెగాఫ్యామిలికీ..  చిరంజీవికి చాలా సన్నిహితమైన వ్యక్తి. ఈ మధ్యకాలంలో చిరంజీవి ఎక్కడికి వెళ్లినా సరే ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కాని పవన్ కల్యాణ్ తో మాత్రం చిన్నపాటి గ్యాప్ ఇప్పటికి ఉంది. ఈ నేపథ్యంలో అటు గ్యాప్ పరంగానే దూరంగా ఉన్నారనేది ఒక వాదనైతే ఇటు పార్టీ మారుతున్నందుకే ఆయన రాలేదనేది ఒక వాదన. జనసేన లాంగ్ మార్చ్ కు వస్తే తప్పుడు సంకేతాలు వచ్చే అవకాశాలున్నాయని కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న వాదన. ఈ వాదనలకు తెర పడాలంటే స్వయంగా గంటానే తన మనసులోని మాట బయట పెట్టాల్సి ఉంది.