ఆశీష్ విద్యార్థికి తప్పిన ప్రాణగండం
posted on Oct 21, 2014 3:43PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు.. అనేక తెలుగు చిత్రాల్లో నటించిన ఆశిష్ విద్యార్థికి త్రుటిలో ప్రాణగండం తప్పింది. భిలాయి సమీపంలో జరుగుతున్న ‘బాలీవుడ్ డైరీ’ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు. నది మధ్యలో ఒక రాయి మీద నిలబడి ప్రార్థిస్తున్నట్టుగా సన్నివేశం చిత్రీకరిస్తుండగా మొన్నామధ్య హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో తెలుగు విద్యార్థులు కొట్టుకుపోయినట్టుగా నది నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో ఆశిష్ విద్యార్థి నీళ్ళలో కొట్టుకుపోయారు. ఆయనకు ఈత రాదు. అయితే సమయానికి అక్కడే వున్న వికాస్ సింగ్ అనే ఓ పోలీసు కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకారు. అశీష్ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ, ఈ సంఘటన తనకు జీవితంలో ఒక గుణపాఠం నేర్పిందని, ఇలాంటి సందర్భాలలో అందరూ జాగ్రత్తగా వుండాలని అన్నారు.