సందిగ్ధంలో పడిన కాంగ్రెసు తెలంగాణ నేతలు

హైదరాబాద్:కాంగ్రెసు అధికార ప్రతినిధి రషీద్ అల్వీ, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటనలు కాంగ్రెసు తెలంగాణ నేతల్లోగుబులు పెరుగుతోంది.బయటకు గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెసు తెలంగాణ నేతల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో గుబులు పెరుగుతోంది. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు వారి ప్రకటనలు సంకేతాలు ఇచ్చాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే ఏం చేయాలనే సందిగ్ధంలో కాంగ్రెసు తెలంగాణ నాయకులు పడ్డారు.తెలంగాణ ఇవ్వబోమని తమ పార్టీ అధిష్టానం చెప్పితే తాము పార్టీకి రాజీనామా చేయడానికైనా వెనకాడబోమని కాంగ్రెసు వీర తెలంగాణవాదులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరారు. మరింత మంది తెరాస వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శాసనసభ్యులే కాకుండా పార్లమెంటు సభ్యులే కాకుండా పార్లమెంటు సభ్యులు కూడా కొంత మంది తెరాసలోకి వెళ్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణపై ప్రభుత్వ ప్రకటనను బట్టి ఆ వలసలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

కాగా, తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన లేకుంటే కొత్త పార్టీ పెట్టాలనే యోచన కూడా కాంగ్రెసు తెలంగాణ నేతల్లో సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెసు పార్టీని స్థాపించాలనే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ హైదరాబాదు వస్తున్నారు. తన అపాయింట్‌మెంట్ కోరిన తెలంగాణ పార్టీ నాయకులకు తాను హైదరాబాదు వస్తున్నానని, అప్పుడు అందరినీ కలుస్తానని ఆజాద్ చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు నేతలు కేశవరావు, జానా రెడ్డి నివాసాల్లో సమావేశమవుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu