పాలు విరిగిపోయాయంటూ పీఎస్ లో కేసు

కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు కాదేదీ పోలీసు కంప్లైంట్ కు అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. తాజాగా కుకట్ పల్లి పోలీసు స్టేషన్ లో అరుదైన కేసు నమోదైంది. అదేంటో తెలుసా.. కొన్న ప్యాకెట్ పాలు విరిగిపోయాయంటూ దుకాణదారుడిపై కేసు పెట్టాడో పెద్దమనిషి. పాపం పోలీసులు కూడా చేసేదేం లేక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..కుకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ సూపర్ మార్కెట్లో పాల ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చి కాచగానే పాలు విరిగిపోయాయి. దీంతో సదరు పాలను కొనుగోలు చేసిన వ్యక్తి రత్నదీప్ కు వెళ్లి సంగతి చెప్పాడు. దానికి దుకాణదారు దానిని మేమేం చేస్తాం అంటూ బదులిచ్చాడు.

దీంతో ఆ కొనుగోలుదారుడు తిన్నగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. దుకాణదారుపై ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   ఇటీవలి కాలంలో ప్యాకెట్ పాలు కాచగానే విరిగిపోతున్నాయనీ, వాసన వస్తున్నాయనీ పలువురు చెబుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కస్టమర్లు అంటున్నారు. లేకుంటే పాలు విరిగిపోయాయి, వాసన వస్తున్నాయంటే పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు.