గాంధీ భవన్ ను విడిచిపెట్టేది లేదు: రాపోలు ఆనందభాస్కర్
posted on Mar 26, 2012 3:50PM
తాను రాజ్యసభకు ఎన్నికయినప్పటికీ గాంధీభవన్ ను మాత్రం విడిచిపెట్టబోనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ స్పష్టం చేశారు. ఆయన తెలుగువన్.కామ్ ప్రతినిధితో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలో ఉంటానని, మిగిలిన సమయంలో గాంధీభవన్ లోనే అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. గాంధీభవన్ లోనే తన రాజకీయ జీవితం ఆరంభమైందని, గాంధీభవన్ లో కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆనందభాస్కర్ అంటున్నారు. తెలంగాణా అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రత్యేక తెలంగాణాను తేవాల్సిన బాధ్యత జాతీయ పార్టీలదేనన్నారు. జాతీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి తెలంగాణా విషయంలో చొరవ చూపించలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో అందరికీ తెలిసిందేనని, ఆ పార్టీ ద్వారానే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న కార్యకర్తలకు సైతం కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభిస్తుందనడానికి తన ఉదంతమే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని చెడిపోయిన వారెవరూ లేరన్నారు. రాజ్యసభ టిక్కెట్ కోసం కోట్లాది రూపాయలు సైతం కుమ్మరించడానికి అనేకమంది సిద్ధంగా ఉన్నారని, అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తనలాంటి నిరుపేదకు రాజ్యసభ అవకాశం కల్పించిందని, అందుకు ఆ పార్టీకి జీవితాంతం ఋణపడి ఉంటానని ఆయన అంటున్నారు.