వాంటెడ్ లిస్టులో మద్యం బినామీలు
posted on Mar 26, 2012 4:10PM
బినామీ పేర్లతో మద్యం దుకాణాలను కోట్లాది రూపాయలకు పాడుకున్న వ్యక్తుల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది మద్యం వ్యాపారులు తమ దగ్గర పనిచేసే కారు డ్రైవర్లు, గుమస్తాలు, లేదా చిరు ఉద్యోగుల పేరుతో మద్యం దుకాణాలను నెలకొల్పారు. కాసుకు ఠికానా లేని ఈ వ్యక్తులకు కోట్లాది రూపాయల ఆస్తులున్నట్లు రికార్డుల్లో చూపించి వారి పేరిట మద్యం దుకాణాలు పాడుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా వీరికి షాపు గుమస్తాలుగానూ, మరో ఉద్యోగిగానో ఉపాధి కల్పించారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే మద్యం షాపులపై ఎసిబి దాడులు జరపడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. నిత్యం లక్షల్లో లాభాలు ఆర్జించిన మద్యం షాపు యజమానులు ఇప్పుడు నష్టాలపాలై షాపులను మూసేస్తున్నారు.
లైసెన్స్ పొందిన 17 నెలల తరువాత వీరు ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు తొలుత వ్యాపారులు బ్యాంక్ గ్యారంటీగా ఇచ్చిన సొమ్మును తామ వాయిదాలకు సరిపెట్టడానికి డ్రా చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖకు డబ్బు చెల్లించిన బ్యాంకులు లైసెన్స్ హోల్డర్లపై వాయిదా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లైసెన్స్ హోల్డర్లలో అత్యధికులు పేద, మధ్యతరగతి వర్గీయులు. ఏదో ఉపాధి దొరుకుతుందని ఆశించి బినామీలుగా మారిన ఈ పేద జనం ఇప్పుడు బ్యాంకుల నుంచి వస్తున్నా ఒత్తిడితో లబోదిబోమంటున్నారు. లక్షల్లో ఉన్న బకాయిల చెల్లింపు విషయమై వీరు తమ యజమానులను అడిగితే వారినుంచి సరైన సమాధానం రావడం లేదు. దీంతో ఈ బినామీలంతా రాత్రికి రాత్రే మాయమైపోతున్నారు. బ్యాంకు అధికారులు వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కొందరయితే తమకు ఏ పాపం తెలియదని, తమ యజమానులు చెప్పినట్లే చేయడం వల్ల తమకు ఈ తిప్పలు వచ్చాయని, తమను ఆదుకోవాలంటూ జిల్లా ఎస్పీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో బినామీ మద్యం వ్యాపారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.