రైల్వేజోన్‌పై నిల‌దీసిన రామ్మోహ‌న్‌.. లోక్‌స‌భ‌లో కేంద్రానికి క్వ‌శ్చ‌న్స్‌..

టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు. ఆయ‌న మైక్ ప‌ట్టుకుంటే ఎట్టా ఉంటాదో తెలుసుగా. గ‌తంలో పార్ట‌మెంట్‌లో స్పెష‌ల్ స్టేట‌స్‌పై రామ్మోహ‌న్ చేసిన ప్ర‌సంగం చారిత్ర‌కం అంటారు. ఇప్ప‌టికీ ఆ స్పీచ్ అనేక మంది చెవుల్లో మారుమోగుతుంటుంది. తాజాగా, ఆయ‌న విశాఖ రైల్వేజోన్‌పై లోక్‌స‌భ‌లో మాట్లాడారు. కేంద్రం తీరును తీవ్రంగా నిర‌సించారు. దేశంలో కొత్త‌గా రైల్వేజోన్లు ఏర్పాటు చేసే ప్ర‌తిపాద‌న ఏదీ లేద‌ని ఇటీవ‌ల కేంద్ర‌మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌పై రామ్మోహ‌న్ నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కొత్త జోన్‌ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతిలేదని లోక్‌సభలో గళమెత్తారు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపడంలేదని త‌ప్పుబ‌ట్టారు.

2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారనీ, ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమన్నారు. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమే అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న రైల్వే జోన్ల జాబితాలో గానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్ల జాబితాలో గానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అంశాన్ని కేంద్రం ఎందుకు చేర్చలేదని ప్ర‌శ్నించారు. ఈ రెండు జాబితాలోనూ లేకపోవడంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. రైల్వే జోన్‌ ఏర్పాటు, ఎంత బడ్జెట్‌ కేటాయిస్తున్నారో చెప్పాలని.. ఏపీ ప్రజల తరఫున మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు.