దొంగ బంగారం కేసులో వైసీపీ నేతలు అరెస్ట్? 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా అక్రమ దందాలు చేస్తున్నారు. అయితే కొందరు వైసీపీ నేతలు అతిగా చేస్తూ  పోలీసులకు పట్టుబడుతున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలుగా ఉన్నారు కాబట్టి. ఎలాగోలా బయటపడుతున్నారు. కాని పక్క రాష్ట్రాల్లో మాత్రం వీళ్ల పప్పులు ఉడకడం లేదు. గతంలో పలువురు వైసీపీ నేతలు తెలంగాణలో అరెస్ట్ అయ్యారు. తాజాగా వైసీపీ నేతలను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.

హిందూపురం వైసీపీ నేతల పలువురిని కర్ణాటక పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దొంగ బంగారం వ్యవహారంలో హిందూపురం వైసీపీ నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో ఓ దొంగల ముఠాను అదుపులోకి తీసుకొని కర్ణాటక పోలీసులు విచారణ నిర్వహించారు. ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు హిందూపురంలోని ముగ్గురు వైసీపీ నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం వైసీపీ నేతలను అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తీసుకెళ్లారు. 

తమను తీసుకెళుతుండగా కర్ణాటక పోలీసుల వాహనాలను అడ్డుకొని వైసీపీ నేతలు రచ్చ చేశారు. స్థానిక పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్న వైసీపీ నేతలను కర్ణాటక పోలీసులు బెంగళూరుకు తీసుకెళ్లారు. వైసీపీ నేతల అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచలనంగా మారింది. తమ పార్టీ నేతలను కేసు నుంచి తప్పించేందుకు కర్ణాటక పోలీసులతో కొందరు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని తెలుస్తోంది.