బ్లాక్ బాక్స్ లో అంతా భద్రం..  మిస్టరీ హిస్టరీ సేఫ్‌..

విమాన, చాపర్ ప్రమాదాలు జరగగానే బ్లాక్ బాక్స్‌ తెరపైకి వస్తుంది. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. ఇప్పటికే బ్లాక్ బాక్స్ అనేది ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బయటపెట్టాయి. దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై వాయుసేన దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణలో బ్లాక్స్ బాక్సే కీలకం కానుంది. హెలికాప్టర్‌ ప్రమాదస్థలిని పరిశీలించిన వాయుసేన అధికారులు  బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. బ్లాక్ బాక్స్ లో నమోదైన సంభాషణలను డీకోడ్ చేస్తూ ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి..? డేటాను ఎలా నిక్షిప్తం చేసుకుంటుంది? 

బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇందులో రికార్డు అవుతుంటాయి. ఒకవేళ రేడార్ సిగ్నల్స్‌ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు. దీని ఆధారంగానే ప్రమాదంపై దర్యాప్తు చేస్తారు. విమానంలో ఎంతో మంది ప్రాణాలు ఉంటాయి. కాబట్టి బ్లాక్ బాక్స్ తప్పనిసరిగా ప్రతి విమానంలోను ఉండాలనేది విమానాయాన రంగంలో ఒక చట్టంగా రూపొందించారు. 

బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది?

బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా  ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్‌లోనే ఎందుకుంటుందో అనేదాని వెనక కూడా ఒక కారణం ఉంది. సాధారణంగా ప్రమాదసమయాల్లో ఒకవేళ మంటలు చెలరేగితే అన్నీ తగలబడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్‌ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ ఉంటుంది. 

బ్లాక్ బాక్స్ వెనక భాగంలోనే ఎందుకు అమరుస్తారు..?

బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఇక్కడే ఎందుకు అమరుస్తారంటే ఇది చాలా సురక్షితమైన చోటని నిపుణులు చెబుతున్నారు.  విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనక భాగం పెద్దగా ధ్వసం కాదు కాబట్టి ఇక్కడే బ్లాక్ బాక్స్‌ను అమరుస్తారు. అదే కాక్ పిట్ అయితే ఎక్కువగా ధ్వంసమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 

బ్లాక్ బాక్సులో ఏముంటాయి? ఎలా పని చేస్తుంది?

బ్లాక్ బాక్సులో రెండు కాంపొనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లయిట్ డేటా రికార్డర్ (FDR) రెండోది కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (CVR).FDR విమానంకు సంబంధించి పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతుంది. అంటే ట్రాజెక్టరీ, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది. వేగం, ఇంధనం ఎంత ఉంది, ఇంజిన్ థ్రస్ట్ లాంటి ముఖ్య పారామీటర్ల సమాచారం స్టోర్ చేస్తుంది ఎఫ్‌డీఆర్. అంతేకాదు విమానం ప్రతి కదలికను రికార్డు చేస్తుంది. అంతేకాదు ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశారు.. ల్యాండింగ్ గేర్‌ వేయడంలో జాప్యం జరిగిందా, లేదా పాక్షికంగా ధ్వంసమైందాలాంటి అంశాలను కూడా ఎఫ్‌డీఆర్ రికార్డు చేస్తుంది. 

ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్‌ కాక్‌పిట్‌లో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేస్తుంది. పైలట్ల సంభాషణ నుంచి ఏటీసీతో పైలట్ల సంభాషణ వరకు ప్రతిదీ రికార్డు అవుతుంది.  ప్రమాదంకు ముందు అరగంట ఏం జరిగిందనేదే కీలకం ఇక పైలట్ ఎక్కడైనా సమస్య ఎదుర్కొన్నారా.. లేక విజిబులిటీ, లేదా వాతావరణ ఇబ్బందులను ఏటీసీకి తెలిపారా..? ప్రమాదం ముందు కాక్‌పిట్‌లో ఏంజరిగింది? వంటి కీలక విషయాలను సీవీఆర్ బయటపెడుతుంది. సీవీఆర్ అందించే నివేదిక ఆధారంగానే ఇది సాంకేతిక సమస్యతో విమాన ప్రమాదం జరిగిందా లేక మానవతప్పిదంతో ప్రమాదం జరిగిందా అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ధృవీకరిస్తారు. ఇవన్నీ ఒక మెటల్ బ్లాక్‌లోని మెమొరీ బోర్డుపై స్టోర్ అయి ఉంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత దీన్ని వెలికి తీసి డీకోడ్ చేస్తారు. 

ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. అయితే క్షణాల్లో, నిమిషాల్లో జరిగే ప్రమాదాలు బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తం కావడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.