కేంద్రం మీద స్వరం పెంచుతున్న వైసీపీ...బడ్జెట్ పై మండిపడ్డ నేత

 

ఇప్పటిదాకా కేంద్రం మీద పల్లెత్తు మాట కూడా అనడానికి సాహసించని ఏపీ పాలక పక్ష నేతలు, నిన్నటి బడ్జెట్ పుణ్యమా అంటూ కేంద్రాన్ని నోరారా తిట్టుకునే స్వాతంత్ర్యం తెచ్చుకున్నట్టయ్యింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన తెలుగు రాష్ట్రాలకి అసలేమీ ఒరిగే అవకాశం లేదు. దీంతో ఇప్పటిదాకా వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తూ వచ్చిన వైసీపీ నేతలు మోడీని కాకుండా కేంద్రాన్ని తిడుతున్నారు. నిన్న ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి బడ్జెట్ మీద మండిపడగా ఈరోజు ఆ పార్టీ నేత సీ రామచంద్రయ్య కూడా మండిపడ్డారు. 

కేంద్రం ఎడా పెడా పన్నులు పెంచిందని, కేంద్రం ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ పనికొస్తుందని, రాష్ట్రాల ప్రయోజనాలపై కేంద్రం దృష్టి పెట్టకుండ బడ్జెట్ ప్రవేశ పెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అంటున్నారు. పెట్రోల్ ధరలు పెంచితే దాని ప్రభావం వివిధ రంగాలపై పడుతుందని, పూర్తి మెజారిటీ వచ్చిందనే రాష్ట్రాలతో పని లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 

అలాగే మీడియాలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తే దేశీయ మీడియా దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ కార్పొరేట్ ఆదాయం పెంచేలా ఉంది తప్ప సామాన్యులకి కాదని పన్నుల విధింపులలో పారదర్శకత లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. మరి దీనిని బీజేపీ ఎలా తీసుకుంటుందో ? ఏమేం ప్రయోగాలు చేయనుందో ఏపీ మీద.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu