సంక్షోభంలో పడ్డ కర్నాటక ప్రభుత్వం...తుమ్మితే ఊడేలా ?
posted on Jul 6, 2019 3:49PM

కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎప్పటి నుండో కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెబుతున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదిపింది. ఈ ప్లాన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్‌కు చెందిన ఇద్దరు రాజీనామా చేశారు. ఇప్పటి వరకు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయడం లేదనే అనుకున్నారు.
కానీ, సీఎం కుమారస్వామి అందుబాటులో లేకపోవడం వీరిని బుజ్జగించే వారు లేకపోవడంతో ఆ ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. ఈరోజు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ రమేష్ కుమార్‌ను కలిసేందుకు విధానసౌధకు వచ్చారు. వారితో ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. తాజా రాజీనామాలతో జేడీఎస్ - కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 105కి పడిపోయింది. అందులో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 225 స్థానాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ మార్కు 113. ప్రస్తుతం కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి బలం 117గా ఉంది. కాంగ్రెస్‌కి 77 ఎమ్మెల్యేలు ఉండగా. జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. బీఎస్పీ 1 స్థానం, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అదే సమయంలో బీజేపీకి ఒంటరిగా 105 ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు ఈ 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదిస్తే ప్రభుత్వానికి మెజార్టీ మార్కు లేనట్లే. బల నిరూపణ జరిపితే సంకీర్ణ సర్కారు కుప్పకూలినట్లే. వెంటనే ఉప ఎన్నికలు జరపక తప్పదు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, ముఖ్యమంత్రి కుమారస్వామి విదేశాల్లో ఉండడంతో ప్రతి క్షణం ఉత్కంటగా మారింది.