వర్మకు రేవంత్ బలే దొరికాడుగా..!
posted on Nov 1, 2017 4:39PM

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాం గోపాల్ వర్మ కన్ను ఇప్పుడు రేవంత్ రెడ్డిపై పడింది. అందరిపై సటైరికల్ గా పోస్ట్ లు చేసే రాంగోపాల్ వర్మ రేవంత్ రెడ్డిని మాత్రం తెగ పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నాడు. దీనికి కారణం ఏంటబ్బా అని మనం పెద్దగా జుట్టుపీక్కుంటూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై టీడీపీ నేతలకు, వర్మకు జరిగిన ఫైట్ గురించి తెలిసిందే. పెద్ద యుద్దమే జరిగినంత పైనంది. దాంతో వర్మ వర్సెస్ టీడీపీ అయింది. ఇక ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి టీడీపీకి షాకిచ్చి కాంగ్రెస్లో చేరడంతో వర్మకు మంటి టాపిక్ దొరికింది. అసలే టీడీపీపై కోపంగా ఉన్న వర్మ రేవంత్ రెడ్డిని పొగుడుతూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ ఇన్ డైరెక్ట్ గా టీడీపీకి మంట పుట్టిస్తున్నాడు. ఇప్పటికే రేవంత్ ను బాహుబలిగా పోల్చిన వర్మ.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో పోల్చుతూ రెండు పోస్టర్లను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. వీటికి 'రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్' అనే టైటిల్ పెట్టాడు. అంతేకాదు, 'బాస్ ఈజ్ హియర్' అంటూ ట్యాగ్ లైన్ కూడా జత చేశాడు. మొత్తానికి ప్రస్తుతానికి వర్మకు రేవంత్ రెడ్డి దొరికాడు... ఆ తరువాత ఎవరిని టార్గెట్ చేస్తాడో చూద్దాం...
