రామ్ చరణ్ ‘జంజీర్’ కబుర్లు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తన ‘నాయక్’ సినిమాతో మంచి ఊపుమీదున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం తెలుగులో ‘ఎవడు’ అనే ఒక సినిమా, హిందీలో ‘జంజీర్’ అనే మరో సినిమా షూటింగులతో చాలా బిజీగా ఉన్నాడు. అతని ‘ఎవడు’ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా శ్రుతీ హాస్సన్ మరియు అమీ జాక్సన్ నాయికలుగా రామ్ చరణ్ తో జత కడుతున్నారు. ఈ సినిమాలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

 

 

ఇక రామ్ చరణ్ తేజ్ హిందీ సినిమాను అపూర్వ లఖియా అనే సుప్రసిద్ధ బాలివుడ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలివుడ్ నెంబర్:1 హీరోయిన్ ప్రియాంకా చోప్రా రామ్ చరణ్ తో జత కట్టడం మరో ప్రత్యేకాకర్షణగా నిలువబోతోంది. గతంలో అమితాబ్ బచ్చన్ చేసిన ఇనస్పెక్టర్ విజయ్ పాత్రను ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ చేస్తున్నాడు.

 

 

రామ్ చరణ్ తేజ్, నిజ జీవితంలో చాలా మృధుస్వభావి, మిత బాషి, స్నేహపూరితంగా ఉంటాడు. కానీ, ఈ సినిమాలో రామ్ చరణ్ తన మనస్తత్వానికి పూర్తి విభిన్నమయిన పాత్రను చేస్తున్నాడు. అతను ఒక కోపిష్టిగా ఎల్లపుడూ ముభావంగా ఉండే పోలీసు ఆఫీసరుగా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇదే విషయం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ, నిజానికి తనకు ప్రధమకోపం ఎక్కువే కానీ, అది నిమిషంలో చల్లారిపోతుందని అన్నాడు. తన సినిమా జీవితంలో మొట్టమొదటిసారిగా పోలీసు యూనిఫారం వేసుకొని నటిస్తున్నందుకు తను చాలా ఆనందపడుతున్నానని అన్నాడు. బాధ్యతగల పోలీసు యూనిఫారం వేసుకొన్నందున షూటింగు సమయంలో బుద్ధిగా కూర్చోంటూన్నానని చెప్పాడు. ప్రస్తుతం హీరోయిన్ ప్రియాంక చోప్రా నుండి తానూ హిందీ మాట్లాడటం నేర్చుకొంటూ, ఆమెకు తెలుగు నేర్పిస్తున్నానని చెప్పాడు. హిందీ రాకపోయినా అర్ధం చేసుకోగలను కనుక, డైలాగుకి తగిన హావాభావాలు ప్రదర్శించడంలో ఇబ్బంది లేదని అన్నాడు.

 

 

గతంలో నిర్మించిన ‘జంజీర్’ సినిమాలో సుప్రసిద్ధ హిందీ నటుడు ప్రాణ్ పోషించిన ‘షేర్ ఖాన్’ (అమితాబ్ స్నేహితుడి పాత్ర)ను ఈ సినిమాలో బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ చేస్తున్నాడు. మొదట ఆ పాత్రను చేయడానికి అయన ఇష్టపడకపోవడంతో, అర్జున్ రాం పాల్ ను ఆ పాత్రకు అనుకొన్నారు. కానీ, సంజయ్ దత్త్ మనసు మార్చుకొని మళ్ళీ రావడంతో షేర్ ఖాన్ పాత్రను తిరిగి ఆయనకే అప్పగించారు.

 

 

ఇక, ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ‘రుస్తుం’గా పేరు నిర్ణయించారు. తెలుగు, హిందీ బాషలలో ఒకేసారి ఈ ఏడాది మే నెల 10వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, 27 సం.ల క్రితం ఆ సినిమాకు కధను అందించిన ప్రముఖ బాలివుడ్ సినీ కధా రచయిత జావేద్ అక్తర్ సినిమా నిర్మాణం మొదలుపెట్టిన కొద్ది రోజులకే, ఆ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసారు. తమ కధను ఆధారంగా చేసుకొని ‘జంజీర్’ సినిమాను పునర్నిర్మిస్తునందున తనకు రూ.6 కోట్లు రాయల్టీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాతలు వారితో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారని రామ్ చరణ్ అన్నాడు.

 

ఒకానొకసమయంలో అమితాబ్ బచ్చన్ను సినిమాలలో నటించడానికి పనికిరావని అందరూ తిరస్కరించినప్పుడు, ఆయన మూట ముల్లే సర్దుకొని అలహాబాద్ తిరిగి వెళ్లిపోదామనుకొంటున్న తరుణంలో ఆయనకు ‘జంజీర్’ ఆఫర్ రావడంతో ఆయన దశ తిరిగి, నేటికీ బాలివుడ్ లో తిరుగులేని హీరోగా నిలబెట్టింది. బాలివుడ్ లో ఆయనకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికించేలా చేసిన ఆ సినిమానే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ చేస్తునందున ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా బాలివుడ్ ద్వారాలు తెరిచి కొత్త అవకాశాలు తెస్తుందని ఆశించవచ్చును.