వైసీపీలో రాజ్యసభ రేస్... ముగ్గురి పేర్లు దాదాపు ఖరారు

వైసీపీలో రాజ్యసభ రేస్ మొదలైంది. వచ్చే ఏడాది ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే, అసెంబ్లీలో పార్టీల బలాబలాల ప్రకారం ఆ నాలుగు సీట్లూ అధికార వైసీపీకే దక్కనున్నాయి. దాంతో, రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు. అయితే, ఖాళీ అవుతోన్న ఆ నాలుగు స్థానాల్లో మూడింటికి ఆల్రెడీ అభ్యర్ధులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన బీద మస్తాన్ రావు, అలాగే గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజుకి రాజ్యసభ సభ్యత్వాలు దాదాపు ఫైనలైజ్ అయినట్లు చెబుతున్నారు. మూడో అభ్యర్ధిగా అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది. ఇక, నాలుగో సీటును ఎస్సీలకు కేటాయించాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ సీటు ఒంగోలును వదులుకున్నప్పుడు వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. పైగా వైవీ సుబ్బారెడ్డి స్వయానా జగన్ కు బాబాయ్ కావడం, ఇఫ్పటికే టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఉండటంతో... మళ్లీ రాజ్యసభకు పంపుతారో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే, రెడ్డి కమ్యూనిటీ నుంచి ఒక్కరికే అవకాశమివ్వాలని జగన్ భావిస్తుండటంతో... అయోధ్యరామిరెడ్డి లేదా వైవీల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశముందంటున్నారు. ఎందుకంటే, వైసీపీకి ప్రస్తుతం ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఉండగా, వాళ్లిద్దరూ రెడ్డి సామాజికవర్గమే. దాంతో, వచ్చే ఏడాది వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని రెడ్డి కమ్యూనిటీ ఇచ్చే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు.

మొత్తానికి వచ్చే ఏడాది రాజ్యసభలో వైసీపీ బలం పెరగనుంది. ప్రస్తుతం ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉండగా, మరో నలుగురు జత కలవనున్నారు. దాంతో, రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య ఆరుకి పెరగనుంది. అలాగే, రాజ్యసభలో వైసీపీకి ప్రాధాన్యత దక్కనుంది.