దక్షిణాదిన బలోపేతానికి బీజేపీ వ్యూహం!

పవన్ కు కేబినెట్ బెర్త్?
తెలుగుదేశంకు గవర్నర్ తాయిలం?

దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. ఉత్తరాదిన పాగా వేసిన బీజేపీకి దక్షిణాది కొరుకుడు పడటం లేదు. ఒక్క కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రజాదరణ పొందలేదు. దీంతో దక్షిణాదిలో పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా కొత్త కొత్త వ్యూహాలు, ప్రణాళికలూ రచిస్తోంది. ఒక వైపు దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులో కొనసాగుతూనే సొంతంగా బలోపేతం కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మాపై ఆధారపడటం అవసరమన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. వ్యూహరచన చేస్తున్నది. 

ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ను సెంట్రిక్ గా చేసుకుని తమిళనాడులో పాగా వేయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతూనే పవన్ కల్యాణ్ తోడ్పాటుతో సొంత బలం పెంచుకోవాలని భావిస్తున్నది.  భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను దగ్గర చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఏపీలో హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్ తనను తాను ఫోకస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.  అంతే కాకుండా కేంద్ర కేబినెట్ విస్తరణకు కసరత్తు చేస్తున్న మోడీ, తన కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కు బెర్త్ ఆఫర్ చేసినట్లు బీజేపీ సన్నిహిత వర్గాల సమాచారం. పవన్ అందుకు అంగీకరించి.. కేంద్ర కేబినెట్ లోకి వెడితే.. ఏపీలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక కేబినెట్ బెర్త్ దక్కేలా తన ఇన్ ఫ్లుయెన్స్ ను ఉపయోగించాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. 

అలా కాకుండా పవన్ ఏపీ కేబినెట్ లో నంబర్ 2గా, అంటే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడానికే మొగ్గు చూపితే.. ఆయన సేవలను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కంటే తమిళనాట.. సినీ గ్లామర్ ప్రభావం రాజకీయాలపై అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.  అందుకే ఇప్పటికే పవన్  బీజేపీ కోరిక మేరకు తమిళనాడుకు సంబంధించినంత వరకూ వ్యూహాత్మకంగా అక్కడ అధికారంలో ఉన్న డీఎంకేకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని చెబుతున్నారు.   

ఇక తెలుగుదేశం పార్టీకి కూడా బీజేపీ తాయిలాలు ఇచ్చి.. కేంద్రంలో మోడీ సర్కార్ కు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరలో పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం చేయాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ.. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిద్దరికి  గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.  పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద దక్షిణాదిలో బలపడటం కోసం బీజేపీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే ఆధారపడి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. జనసేన, తెలుగుదేశం పార్టీలతో సఖ్యత కొనసాగిస్తూనే ఆ రెండు పార్టీల తోడ్పాటుతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు.