రాజా సింగ్ కోరుకొన్నదే జరుగబోతోందేమో?

 

ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్ధులు గోమాంసంతో విందు (బీఫ్ ఫెస్టివల్) చేసుకొంటారనే వార్తలపై స్పందిస్తూ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు పార్టీ సిద్దం అవుతోంది.

 

“ఒకవేళ ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ చేసుకొన్నట్లయితే, నా సత్తా ఏమిటో ఈసారి వారికి రుచి చూపిస్తాను. బీఫ్ ఫెస్టివల్ చేసుకొనట్లయితే దాద్రి సంఘటనలు హైదరాబాద్ లో కూడా పునరావృతం అవుతాయని హెచ్చరించారు. గోమాంసం తిన్నారనే అనుమానంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాద్రిలో ఒక వ్యక్తిని కొందరు అతి కిరాతకంగా చంపారు. ఆ దురదృష్టకర సంఘటన వలన నేటికీ మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్ ఈవిధంగా మాట్లాడటంతో పార్టీకి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకోవలసివస్తోంది.

 

ఆయన గత ఏడాది కాలంగా పార్టీ కార్యాలయానికే రాలేదని బహుశః తెరాసలో చేరేందుకే పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘిస్తూ పార్టీకి వ్యతిరేకంగా, నష్టం కలిగించే విధంగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత వెంకట రెడ్డి అభిప్రాయపడ్డారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ముందు పార్టీకున్న ఐదుగురు ఎమ్మెల్యేలలో ఒకరిని అధికార తెరాస పార్టీకి కోల్పోవలసి వస్తే దాని వలన బీజేపీకి చాలా నష్టం జరుగవచ్చును. కానీ రాజా సింగ్ ధోరణి వలన పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది కనుక పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ రాజా సింగ్ తెరాసలో చేరే ఉద్దేశ్యంలో ఉన్నట్లయితే ఆయన కూడా అదే కోరుకొంటున్నారేమో?