కిషన్ రెడ్డిని పదవిలో నుంచి తొలగించాలి: బీజేపీ ఎమ్మెల్యే

 

హైదరాబాద్, ఘోషా మహల్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ ఈరోజు ఆకస్మాత్తుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై విరుచుకుపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలంగా ఎదగలేకపోవడానికి కారకుడు కిషన్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పధకాలు, అభివృద్ధి పనుల గురించి తెలంగాణాలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను పార్టీ వైపు ఆకర్షించడంలో కిషన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని రాజా సింగ్ ఆరోపించారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను పైకి ఎదగనీయకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణాలో పార్టీకి కిషన్ రెడ్డే ప్రధాన అవరోధంగా ఉన్నారని, కనుక ఆయనని తక్షణమే ఆ పదవిలో నుండి తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడికి ఒక లేఖ కూడా వ్రాశానని రాజా సింగ్ తెలిపారు.

 

రాజా సింగ్ పార్టీ అధ్యక్షుడకి వ్యతిరేకంగా అధిష్టానానికి లేఖ వ్రాయడం చూస్తుంటే ఆయనకు పార్టీలో కొనసాగే ఉద్దేశ్యం లేనట్లు కనిపిస్తోంది. త్వరలో జరుగబోయే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస ఒంటరిగా పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ తెదేపా-బీజేపీ-మజ్లీస్ పార్టీలు చాలా బలంగా ఉన్న చోట్ల తెరాస ఒంటరిగా పోటీ చేసి ఏవిధంగా నెగ్గుకు రాగలదనే అనుమానం కలగడం సహజమే. కనుక ఈ ఎన్నికలలోగా తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ప్రత్యర్ధి పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేయవచ్చును. తెరాస నేతలు బహుశః రాజా సింగ్ ని ఇప్పటికే సంప్రదించారేమో? అందుకే ఆయన ఏకంగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనే ఈ విధంగా విమర్శలు గుప్పిస్తున్నారేమో? పార్టీ అధ్యక్షుడుని విమర్శించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నట్లయితే జరిగేది అదే!